నల్గొండ అర్బన్, వెలుగు : స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా నల్గొండలోని సెయింట్ అల్ఫోన్సస్ హైస్కూల్‌లో ఆదివారం జానపదకళా ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సోమవారం ప్రతి ఇల్లు, ఆఫీస్‌పై జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించారు. ఆగస్ట్ 16న ఉదయం 11.30 గంటలకు నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపనలో ప్రతిఒక్కరూ పాల్గొనాలని చెప్పారు. ఈ సందర్భంగా పోలీస్ జాగృతి బృందం, స్టూడెంట్లు చేసిన డ్యాన్స్‌లు ఆకట్టుకున్నాయి. ఆర్డీవో జగన్నాథరావు, డీపీఆర్‌వో శ్రీనివాస్, డీఎంహెచ్‌వో కొండల్‌రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశం పాల్గొన్నారు.
చదువుతోనే భవిష్యత్
యాదాద్రి, వెలుగు : చదువుతోనే భవిష్యత్ బాగుంటుందని యాదాద్రి అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం యాదాద్రి జిల్లా భువనగిరి, ఆలేరులో జానపదకళా ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ హాజరై మాట్లాడారు. నిరక్షరాస్యత కారణంగా చాలా మంది వెనుకబాటుకు గురవుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, వైస్‌చైర్మన్ చింతల కిష్టయ్య, మున్సిపల్ కమిషనర్లు నాగిరెడ్డి, మారుతీప్రసాద్, డీపీఆర్‌వో ఖాజామైనొద్దీన్, సంజీవరెడ్డి పాల్గొన్నారు.
ఈటలను కలిసిన పడాల శ్రీనివాస్
యాదాద్రి, వెలుగు : ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, టీఆర్‌ఎస్ బహిష్కృత నేత పడాల శ్రీనివాస్ ఆదివారం హైదరాబాద్‌లో బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలపై ఆరా తీశారు. టీఆర్‌ఎస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని పడాల శ్రీనివాస్ ఈటల దృష్టికి తీసుకొచ్చారు. ‘బీజేపీలో రాజకీయ భవిష్యత్ బాగుంటుంది, కలిసి పనిచేద్దాం రండి’ అని ఈటల ఆహ్వానించినట్లు శ్రీనివాస్ తెలిపారు.
12 రోజులు.. 153 కిలోమీటర్లు
ఉమ్మడి జిల్లాలో ముగిసిన ప్రజాసంగ్రామ యాత్ర
యాదాద్రి, వెలుగు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఆదివారం యాదాద్రి జిల్లా గుండాల మండలంలో కొనసాగింది. మోత్కూరు శివారు నుంచి యాత్ర ప్రారంభం కాగా గుండాల, పాచిళ్ల, తుర్కలషాపురంలో రచ్చబండ నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని గౌరవెల్లి బాధితులు బండి సంజయ్‌ని కలిశారు. అనంతరం యాత్ర పెద్దపడిశాల, వస్తాకొండూరు మీదుగా బండకొత్తపల్లికి చేరుకుంది. అక్కడి నుంచి సోమవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో యాత్ర సాగనుంది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో బండి సంజయ్ యాత్ర పూర్తైంది. మూడో విడత ప్రజా సంగ్రామయాత్రలో భాగంగా బండి సంజయ్ 12 రోజుల పాటు 153.3 కిలోమీటర్లు నడిచారు. ఆగస్టు 2న యాదగిరిగుట్టలో ప్రారంభమైన యాత్ర యాదాద్రి, నల్గొండ జిల్లాలోని ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో సాగింది. ఈ సందర్భంగా 5 గ్రామసభలు, 10 పబ్లిక్ మీటింగ్స్ నిర్వహించారు. యాత్రలో భాగంగా బండి సంజయ్ ప్రధానంగా మూసీ కాలుష్యంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, పోచంపల్లిలో నేతన్నల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు ప్రజలు తమకు పెన్షన్లు, డబుల్ ఇండ్లు రావడం లేదని, ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని బండి సంజయ్ దృష్టికి తీసుకొచ్చారు. ఆయన వెంట యాత్ర ప్రముఖ్ గంగిడి మనోహర్‌రెడ్డి, సంగప్ప, యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యాంసుందర్‌రావు, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, కడియం రాంచంద్రయ్య ఉన్నారు.
సూర్యాపేట ఎస్‌బీఐలో ఫొటో ఎగ్జిబిషన్
సూర్యాపేట, వెలుగు : స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా సూర్యాపేట పట్టణంలోని ఎస్‌బీఐలో ఆదివారం ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను స్వాతంత్ర్య సమరయోధులు టంగుటూరి కోటయ్య, గాలి వెంకటయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో జరిగిన ప్రధాన ఘట్టాలతో ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభించడం హర్షణీయం అన్నారు. అనంతరం ఎగ్జిబిషన్ చూసేందుకు వచ్చిన కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్‌కు బ్రాంచ్ చీఫ్ మేనేజర్ మురళీధర్‌రెడ్డి ప్రదర్శన వివరాలను వివరించారు. అనంతరం ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ కృష్ణమోహన్, బ్యాంక్ సిబ్బంది నరసింహులు, కిశోర్, వరప్రసాద్, సైదులు, మహేశ్, సురేష్, శ్రీను పాల్గొన్నారు.
పులిచింతలకు 3 లక్షల ఇన్‌ఫ్లో
మేళ్లచెరువు (చింతలపాలెం), వెలుగు : సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి 3 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో 9 గేట్లను ఎత్తి 2,87,903 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 45.77 అడుగులు కాగా ప్రస్తుతం 37.7 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
2 కిలోల వెండి చోరీ
మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లి చెన్నకేశ్వరస్వామి ఆలయంలో చోరీ జరిగిన ఆదివారం వెలుగుచూసింది. శనివారం రాత్రి అర్చకులు గుడికి తాళం వేసి వెళ్లిపోయారు. గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి తాళాలు పగులగొట్టి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం గుడికి వచ్చిన అర్చకులు తాళాలు పగులగొట్టి ఉండడాన్ని గమనించిన ఆలయ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి వివరాలు సేకరించారు. 2 కిలోల ఆభరణాలు చోరికి గురైనట్లు గుర్తించారు.
పంద్రాగస్ట్‌కు ఏర్పాట్లు పూర్తి
పంద్రాగస్ట్ వేడుకలకు సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేడుకల నిర్వహణ, సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. సూర్యాపేటలో ఆదివారం పోలీసులు పరేడ్ రిహార్సల్స్ నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్‌లో చేసిన ఏర్పాట్లను ఎస్పీ రాజేంద్రప్రసాద్ పరిశీలించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా యాదాద్రి కలెక్టరేట్‌ను కలర్‌ఫుల్ లైటింగ్‌తో తీర్చిదిద్దారు.
ఘనంగా వజ్రోత్సవ సంబరాలు
స్వాతంత్ర్య వజ్రోత్సవ సంబరాలను ఆదివారం ఉమ్మడి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని లిటిల్ స్కాలర్ స్కూల్‌లో స్టూడెంట్లు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో దివిస్ కంపెనీ ఉద్యోగులు స్థానిక బస్టాండ్ నుంచి దివీస్ కంపెనీ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. నల్గొండ జిల్లా చండూరులో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు చలమల్ల సీతారాంరెడ్డి, మిర్యాలగూడలో ముస్లింల ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు.
– మేళ్లచెరువు/చౌటుప్పల్/చండూరు/మిర్యాలగూడ, వెలుగు