శ్రీశైలానికి పోటెత్తుతున్న వరద

  • 1.75 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో.. రాబోయే రోజుల్లో మరింత పెరిగే చాన్స్
  • ఆల్మట్టి, నారాయణపూర్​ నుంచి2 లక్షల క్యూసెక్కులు విడుదల
  • భద్రాచలం నుంచి గోదావరిలోకి10.11 లక్షల క్యూసెక్కులు 

హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్​ ప్రాజెక్టుల నుంచి 2 లక్షల క్యూసెక్కులకుపైగా వరదను జూరాలకు రిలీజ్​ చేస్తున్నారు. మరిన్ని రోజులపాటు ఇదే విధంగా వరద కొనసాగుతుందని, మరింత పెరిగే అవకాశమూ ఉందని అధికారులు చెప్తున్నారు. ఆల్మట్టి నుంచి 2 లక్షల క్యూసెక్కుల వరదను రిలీజ్​ చేస్తున్నారు. క్రమంగా దానిని 2.25 లక్షల క్యూసెక్కులకు పెంచనున్నారు. 

ఇటు నారాయణపూర్​ నుంచి 2,02,625 క్యూసెక్కుల వరదను విడుదల చేస్తున్నారు. జూరాలకు 1.65 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 1,50,593 క్యూసెక్కులు రిలీజ్​ చేస్తున్నారు. శ్రీశైలానికి బుధవారం ఉదయం 1.94 లక్షల క్యూసెక్కుల వరద రాగా.. సాయంత్రానికి కొంచెం తగ్గింది. 1,75,448 క్యూసెక్కుల వరద కొనసాగుతున్నది. రెండు రోజుల్లో అది మరింత పెరిగే అవకాశం ఉంది. 

తుంగభద్ర ప్రాజెక్టు కూడా దాదాపు నిండింది. ప్రాజెక్టుకు 86,663 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 18,746 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. గురువారం, శుక్రవారం ప్రాజెక్టు నుంచి వరద మరింత పెరిగే అవకాశం ఉంది. గోదావరి నుంచి 10.11 లక్షల క్యూసెక్కుల వరద సముద్రంలోకి పోతున్నది. మేడిగడ్డ బ్యారేజీ నుంచి 7.87 లక్షలు, సమ్మక్కసాగర్​ నుంచి 9.75 లక్షలు, సీతమ్మసాగర్​ ప్రాజెక్ట్​ నుంచి 10.22 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. 

వదలని ముసురు.. 

రాష్ట్రంలో బుధవారం కూడా ముసురు వదలలేదు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. హైదరాబాద్​ సిటీలో ఉదయం నుంచి మబ్బులు పట్టి చిరుజల్లులు కురిశాయి. 

మరో రెండు రోజుల పాటు వెదర్​ ఇలాగే ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కాగా, బుధవారం జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో అత్యధికంగా 2.8 సెంటీ మీటర్ల వర్షం పడింది. ములుగు జిల్లా మల్లంపల్లిలో 2.7, ఆదిలాబాద్​ జిల్లా హీరాపూర్​లో 2.4, ఆదిలాబాద్​లో 2.4, కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా కౌటాలలో 2.2, లోన్​వెల్లిలో 2 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లో దానికన్నా తక్కువగా వర్షం కురిసింది.