హైదరాబాద్ శివారులో చైన్ స్నాచింగ్ల కలకలం.. వృద్ధులే టార్గెట్.. ఇంట్లోకి చొరబడి మరీ స్నాచింగ్

హైదరాబాద్ శివారులో చైన్ స్నాచింగ్ల కలకలం.. వృద్ధులే టార్గెట్.. ఇంట్లోకి చొరబడి మరీ స్నాచింగ్

ఎల్బీనగర్, వెలుగు: సిటీ శివారులో ఒకే రోజు వరుస చైన్ స్నాచింగ్​లు జరగడం కలకలం సృష్టిస్తున్నది. వృద్ధులే టార్గెట్​గా ఈ దోపిడీలు జరిగాయి. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా నకిరేకల్ కాసన్నగోడుకు చెందిన బుర్రి రుక్మిణమ్మ(86) చంద్రపురి కాలనీలోని తన కొడుకు వద్ద నివాసం ఉంటోంది. 

సోమవారం ఇంటి ముందు ఆమె కూర్చొని ఉండగా, తొలుత ఒక దుండగుడు మాస్క్ ధరించి అనుమానం రాకుండా అదే ఇంట్లోని మూడో అంతస్తుకు వెళ్లాడు. ఆ తర్వాత కిందకు దిగుతూ మెట్లపై కూర్చున్న రుక్మిణమ్మ మెడలోని 1.5 తులాల గోల్డ్​చైన్​లాక్కెళ్లాడు. ఆదిబట్ల పీఎస్​పరిధిలోని తుర్కయంజాల్​లో నివాసం ఉంటున్న అనసూయ(69) తన ఇంట్లో వంట చేస్తుండగా, ఓ దుండగుడు ఇంట్లోకి చొరబడి ఆమె మెడలోని 3 తులాల చైన్ ఎత్తుకెళ్లాడు. 

ఇక మీర్ పేట పరిధిలోని టీఎస్ఆర్ కాలనీలో యాదమ్మ(57) అనే వృద్ధురాలు షాపు నిర్వహిస్తున్నది. షాపులోకి వచ్చిన దుండగుడు ఆమె మెడలో ఉన్న 2.5 తులాల బంగారు చైన్ లాక్కెళ్లాడు. దీంతో ఆయా పోలీస్ స్టేషన్​లలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాలను పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలించారు. 

చైన్ స్నాచింగ్ తో అలెర్ట్ అయిన పోలీసులు ఎక్కడికక్కడ వెహికల్ చెకింగ్ ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. అయితే ఈ స్నాచింగ్ లు అన్ని ఒక్కరే చేశారా లేక వేర్వేరు దుండగులు పనా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్నది.