
చెన్నూర్, వెలుగు : మంచిర్యాల జిల్లా చెన్నూరులో బాల్క సుమన్ అనుచరులు రెచ్చిపోతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారు. శనివారం సాయంత్రం పట్టణంలోని 16వ వార్డు కౌన్సిలర్ తుమ్మ రమేశ్.. అదే వార్డుకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త బొంతల సందీప్‌పై దాడికి పాల్పడ్డాడు. వార్డులో జేసీబీతో పనిచేయిస్తూ సందీప్ ఇంటికి సంబంధించిన కరెంట్ సర్వీస్ వైరును తెంపారు. ఈ విషయమై ప్రశ్నించినందుకు ‘‘నువ్వు కాంగ్రెస్‌లో ఎందుకు తిరుగుతున్నావు?” అంటూ సందీప్ఇంట్లోకి వెళ్లి కర్రతో దాడి చేశాడు. బూతులు తిడుతూ కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురిచేశాడు. తీవ్రంగా గాయపడ్డ సందీప్‌ను కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన ట్రీట్ మెంట్ కోసం మంచిర్యాలకు తరలించారు. దాడిని నిరసిస్తూ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆందోళన చేశారు. అనంతరం రమేశ్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అతడిపై హత్యాయత్నం కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రమేశ్‌పై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అంతకుముందు పట్టణంలోని పెద్దవాడకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త టింకు పైనా బాల్క సుమన్ అనుచరుడు తగరం సంపత్దాడి చేశాడు.
దాడిని ఖండించిన వివేక్ వెంకటస్వామి
చెన్నూరులో కాంగ్రెస్ కార్యకర్తపై బాల్క సుమన్ అనుచరుడి దాడిని కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి ఖండించారు. బీఆర్ఎస్ లీడర్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని రౌడీయిజం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దాడి చేసిన వారిపై కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని కోరారు. ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పోలీసులను ఫోన్ ద్వారా కోరారు.