జై శ్రీరామ్.. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంపై .. పాక్‌ మాజీ క్రికెటర్ ట్వీట్

జై శ్రీరామ్..  అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంపై ..  పాక్‌ మాజీ క్రికెటర్ ట్వీట్

అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం అంగరంగవైభవంగా సాగింది. ప్రత్యక్షంగా కొన్ని వేల మంది, పరోక్షంగా కోట్లాది మంది నీలమేఘశ్యాముడి వేడుకను తిలకించారు. దేశవిదేశాల్లోని భారతీయులు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. రామభక్తులు మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. విదేశీ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు భారత సంతతి ఆటగాళ్లూ కూడా రామమందిర నిర్మాణం గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

పాకిస్థాన్ మాజీ ఆటగాడు  డానిష్‌ కనేరియా అయోధ్య రామమందిరంపై  ట్విట్టర్ లో తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. రామ్‌లల్లా శంకుస్థాపన కోసం ఎదురు చూస్తున్నానని గతంలో చెప్పిన కనేరియా,ప్రారంభోత్సవం తర్వాత ఇది చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. శతాబ్దాల నిరీక్షణ ముగిసింది, ప్రతిజ్ఞ నెరవేరింది, ప్రాణ ప్రతిష్ఠ పూర్తయిందని అంటూ తన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు.  అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో రామాలయాన్ని తన భార్యతో కలిసి సందర్శించాడు కనేరియా. అనంతరం అక్కడి హిందువులతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.  

డానిష్‌  కనేరియా అనిల్ దల్పత్ తర్వాత పాకిస్థాన్ తరపున ఆడిన రెండవ భారత సంతతికి చెందిన ఆటగాడు.  కనేరియా 61 టెస్టు మ్యాచ్‌ల్లో 261 వికెట్లు పడగొట్టాడు. 18 వన్డేలు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో 261 వికెట్లతో పాకిస్థాన్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన 4వ బౌలర్‌గా నిలిచాడు. కానీ 2010 ఇంగ్లాండ్ పర్యటనలో మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో నిషేదాన్ని ఎదురుకున్నాడు.  కనేరియా సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు.