భద్రాద్రిలో చతుర్ముఖ పోటీ

భద్రాద్రిలో చతుర్ముఖ పోటీ
  •     కాంగ్రెస్​తో కమ్యూనిస్టులు కటీఫ్​?
  •     ఇక పక్కా ప్రణాళికతో ప్రజల్లోకి  ప్రధాన పార్టీల అభ్యర్థులు..

భద్రాచలం, వెలుగు : కాంగ్రెస్​కు కమ్యూనిస్టులు కటీఫ్​ చెప్పడంతో భద్రాచలం నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ తప్పేలా లేదు. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్​, బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారం కూడా చేస్తున్నాయి. గురువారం సీపీఎం రాష్ట్ర వ్యాప్తంగా పోటీకి దిగుతామని ప్రకటించిన నియోజకవర్గాల్లో భద్రాచలం కూడా ఉంది. ఇది సీపీఎంకు మంచి పట్టు ఉన్న ప్రాంతం.

గతంలోనే తమ పార్టీ నుంచి పోటీ చేయాల్సి వస్తే ఆదివాసీ గిరిజన సంఘం నాయకుడు కారం పుల్లయ్య బరిలో ఉంటారని సీపీఎం ప్రకటించింది. పొత్తుల చర్చలు జరుగుతున్న సమయంలోనే సీపీఎం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఒక దఫా పర్యటన, ప్రచారం కూడా ముగించేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇక నియోజకవర్గంలో ప్రధాన పార్టీల మధ్య రసవత్తర పోరు ఖాయమని తేలిపోయింది. 

కాంగ్రెస్ హవా కొనసాగేనా?

ఇప్పటికే భద్రాచలం నియోజకవర్గంలో 1952 నుంచి 2018 వరకు జరిగిన ఎన్నికల్లో ఐదుసార్లు కాంగ్రెస్​ అభ్యర్థులు గెలుపొందారు. 1957లో పీవీ రావు, 1967లో కన్నయ్యదొర, 1972లో మట్టా రామచంద్రయ్య, 2009లో కుంజా సత్యవతి, 2018 గత ఎన్నికల్లో పొదెం వీరయ్య కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.  

ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణలో బీఆర్ఎస్​ను ఢీ కొడుతున్న కాంగ్రెస్ హవా ఈసారి ఎన్నికల్లో కూడా కొనసాగుతుందని భావిస్తున్నారు. పొదెంపై నియోజకవర్గంలో సాఫ్ట్ కార్నర్​ ఉంది. అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా పార్టీనే నమ్ముకుని కష్ట సమయంలోనూ కొనసాగిన ఆయనపై పార్టీకి కూడా అపారమైన నమ్మకం ఉంది. మరోవైపు నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంకు ఉన్న టీడీపీ మద్దతు కూడా తిరిగి ఆయనకే దొరుకుతుండడం కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. 

కంచుకోటలో ఎర్రజెండా ఎగిరేనా..

భద్రాచలం నియోజకవర్గం పేరు చెబితే సీపీఎంకు కంచుకోట అని గుర్తుకు వస్తుంది.  1978, 83లో ముర్ల ఎర్రయ్యరెడ్డి రెండు సార్లు, 1985, 89, 94లో మూడుసార్లు కుంజా బొజ్జి, 1999,  2004,  2014లో సున్నం రాజయ్య మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్​ ఎమ్మెల్యేలుగా సీపీఎంకు ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర విభజన తర్వాత పట్టు ఉన్న చింతూరు, కూనవరం, వీఆర్​పురం, భద్రాచలం రూరల్​ మండలాలు ఆంధ్రాకు వెళ్లిపోవడంతో సీపీఎం డీలా పడింది.

గత ఎన్నికల్లో మాజీ ఎంపీ మిడియం బాబూరావు ఎమ్మెల్యేగా పోటీ చేసి 13వేల ఓట్లను రాబట్టుకున్నారు. నిత్యం పోరాటాల రూపంలో ప్రజాక్షేత్రంలో ఉండే సీపీఎం తమ పట్టును ఉద్యమాల ద్వారా పెంచుకుంది. చతుర్ముఖ పోటీలో గెలిచే చాన్స్​ ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం సీపీఎం నుంచి బరిలోకి దిగే 38 ఏళ్ల కారం పుల్లయ్యకు ఉద్యమ చరిత్ర ఉంది. పోలవరం, పోడు భూముల పోరాటాల్లో జైలుకెళ్లారు. 

పాగా వేసేందుకు బీఆర్​ఎస్ ప్రయత్నం

బీఆర్ఎస్​ భద్రాచలం నియోజకవర్గంలో పాగా వేసేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. 2014లో మానె రామకృష్ణ పోటీకి దిగినా ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు. కానీ 2018 ఎన్నికల్లో తెల్లం వెంకట్రావు కాంగ్రెస్​ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు గట్టిపోటీ ఇచ్చారు. 11వేల ఓట్ల తేడాతో ఓడిపోయినా ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించారు. తాజా ఎన్నికల్లో ఆయనే రెండోసారి బీఆర్​ఎస్​ నుంచి పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్సీ తాతా మధు ఎన్నికల ఇన్​చార్జ్ గా వ్యవహరిస్తున్నారు. అయితే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ కాంగ్రెస్​లో చేరడంతో వాజేడు, వెంకటాపురం మండలాల్లో బీఆర్​ఎస్​కు బిగ్​ షాక్ తగిలింది. అంతర్గత కుమ్ములాటలు కూడా ప్రతికూలం కానున్నాయి. 

మన్యంలో గెలువాలని బీజేపీ తాపత్రయం

బీజేపీ భద్రాచలం మన్యంలో గెలవాలని దశాబ్ధ కాలంగా తాపత్రయ పడుతోంది. కీలకమైన నేతగా, రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తూ మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి ఇటీవల గుండెపోటుతో చనిపోవడం పార్టీకి తీరని లోటు అని చెప్పొచ్చు. ఆమె భర్త కుంజా ధర్మారావును బీజేపీ హైకమాండ్​ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించింది. ఈయన గతంలో సీపీఎంలో దుమ్ముగూడెం జడ్పీటీసీగా, ఆ పార్టీ డివిజన్​ సెక్రటరీగా పనిచేశారు. తర్వాత వైసీపీలో ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. బీజేపీలో కూడా కీలకమైన నేతగా ఉన్నారు. గిరిజనుల్లో పట్టున్న లీడర్​ కావడంతో ఇతర పార్టీలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

ALSO READ : నామినేషన్ల ప్రక్రియకు భారీ బందోబస్తు