కుక్కల నియంత్రణకు చర్యలేవి? : కోడం పవన్​ కుమార్

విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన శునకం, మనిషిపట్ల అవిశ్వాసాన్ని ఎందుకు పెంచుకుంటోంది? దొంగలు, నేరస్థులను అట్టే పట్టేయగల జాగిలం, చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంటుందెందుకు? ఊరికి కాపలాగా ఉండే కాలభైరవుడు, ఊర్లోకి చొరబడి స్వైరవిహారం చేస్తూ భయకంపితుల్ని చేస్తుందెందుకు? పల్లెలు, పట్టణాలు, నగరాలన్న తేడా లేకుండా వీధికుక్కల సమస్య అందరినీ బెంబేలెత్తిస్తోంది. ముఖ్యంగా చిన్నారులను వెంబడించి ప్రాణాలు తీస్తున్న సంఘటనలు కలవరానికి గురిచేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షలకుపైగా వీధికుక్కలున్నాయి. వీటిలో హైదరాబాద్ నగరంలో ఐదు లక్షలున్నాయి. దీంతో భారీగా కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయి. 2021లో 70,290, 2022లో 80,281 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అత్యధికంగా పిల్లలున్నారు. దేశవ్యాప్తంగా కుక్కకాటు కేసుల్లో తెలంగాణ 8వ స్థానంలో ఉంది. హైదరాబాద్ మహానగరం పరిధిలో కుక్కకాటు వల్ల ఏటా 50 మంది చనిపోతుంటే, దాదాపు వెయ్యి మందికి పైగా తీవ్రంగా గాయపడి వైద్యచికిత్స తీసుకోవాల్సి వస్తోంది. నారాయణగూడలోని ఐపీఎం(ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్) కు నిత్యం 200 మంది కుక్కకాటు బాధితులు చికిత్స కోసం వస్తున్నారు.

కలవర పెడుతున్న ఘటనలు

హైదరాబాద్ లోని అంబర్​పేట చే నంబర్ చౌరస్తాలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడి మరణించిన సంఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. రాజస్థాన్ లోని హిరోహీ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో తల్లి పక్కన పడుకున్న నెలశిశువును వీధి కుక్కలు ఎత్తుకెళ్లి చంపేసిన ఘటన దేశవ్యాప్తంగా కలవరపరిచింది. స్నేహితురాలితో ఆడుకోవడానికి పొరుగింటికి వెళ్లిన ఆరేళ్ల బాలికపై పెంపుడు కుక్క దాడి చేయడంతో ముఖంపై తీవ్ర గాయాలవడంతో వెయ్యికిపైగా కుట్లు వేసిన హృదయవిదారకరమైన సంఘటన అమెరికాలోని చెస్టర్ విల్లేలో కలకలం రేపింది. ఈ మూడు ఉదంతాలు ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే జరిగాయి. 2016 ఫిబ్రవరి నెలలో కుషాయిగూడలో కుక్కల దాడికి 8 ఏళ్ల బాలిక మృతి చెందింది. 2017లో 14 మంది, 2018లో 9 మంది కుక్కకాటుతో మరణించారు. 2020లో అమీర్​పేటలో ఒకే ఒక్క రోజున 50 మంది కుక్కకాటుకు గురయ్యారు. 2022 డిసెంబర్ నెలలో పీర్జాదీగూడలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. 2021 జనవరి 30న బహదూర్​పురాలో 8 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఇక వెలుగులోకి రాని మరణ సంఘటనలు కోకొల్లలు. 

నివారణ లేక పెరుగుతున్న సంతతి

ఒక కుక్క ఏడాది కాలంలో దాదాపు 42 కుక్క పిల్లలను పెట్టగలదని,  వాటి పిల్లలు, పిల్లల పిల్లలు ఇలా ఏడేళ్ల కాలంలో దాదాపు నాలుగు వేల కుక్కలు పుడతాయని అంచనా. ఇలా కుక్కల సంతతి అభివృద్ధి చెందుతున్నా వాటిని తగ్గించే కార్యక్రమాలు అంత చురుగ్గా సాగడం లేదు. ఈ కుక్కలను నియంత్రించడానికి స్టెరిలైజేషన్ మినహా ప్రత్యామ్నాయ మార్గం లేదు. కుక్కల పునరుత్పత్తి ప్రక్రియను నియంత్రించడానికి శస్త్రచికిత్స చేయాల్సిందే. ఈ మేరకు సుప్రీంకోర్టు దశాబ్ద కాలం క్రితమే కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ, వాటి సంఖ్య మాత్రం ఏ ఏటికాయేడు పెరుగుతూనే ఉన్నది. కుక్కల సంఖ్యను తగ్గించే చర్యల్లో భాగంగా ఐదేళ్ల క్రితం వీధికుక్కలను పెంచుకునేలా ‘మా ఇంటి నేస్తం’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అప్పట్లో మూడు వేల వీధికుక్కలను ఆసక్తి ఉన్నవారికి దత్తత ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఆ పథకం ఊసే లేదు. ‘కేటీఆర్ అంకుల్ మమ్మల్ని వీధికుక్కల బారి నుంచి కాపాడండి’ అంటూ చిన్నారులు ప్లకార్డులతో ప్రదర్శనలు జరిపిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కుక్కకాట్లతో కన్నీటి చారికలు ఆరడం లేదు.

కుక్కకాటును నిర్లక్ష్యం చేయొద్దు

కుక్కకాటుకు గురైన తర్వాత చికిత్స తప్పనిసరి. తొలుత గాయాన్ని సబ్బు లేదంటే యాంటీ సెప్టిక్ లోషన్​తో శుభ్రంగా కడగాలి. దీనివల్ల రేబిస్ వైరస్ ఉంటే వాటి కణాలు ధ్వంసమై శరీరంలోకి చేరకుండా ఉంటుంది. అనంతరం టీటీ ఇంజక్షన్ తీసుకోవాలి. తర్వాత రేబిస్ రాకుండా యాంటి రేబిస్ టీకా డోసులు తీసుకుని జాగ్రత్తలు పాటించాలి. సకాలంలో తగిన చికిత్స అందకపోవడం వల్ల చాలామంది మృత్యువాత పడుతున్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఏటా 59 వేల మంది వరకు రేబిస్ వ్యాధికి బలవుతున్నారు. అందులో ఆఫ్రికా, ఆసియా సంఖ్య ఎక్కువగా ఉంటోంది. మొత్తం రేబిస్ మరణాల్లో 36 శాతం మన దేశంలోనే ఉండటం ఒకింత బాధాకరం. ఇందుకు ప్రధాన కారణం.. సకాలంలో వ్యాక్సిన్ తీసుకోకపోవడం, తీసుకోవడానికి ముందుకు వచ్చినప్పటికీ చాలాచోట్ల వ్యాక్సిన్ కొరత ఉండటం. సోని అనే ఏడేళ్ల చిన్నారి వీధి కుక్కల బారినపడి మృతి చెందిన ఘటనను 2016లో బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సుమోటోగా స్వీకరించింది. ప్రస్తుతం అలాంటి ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు, వీధికుక్కల నియంత్రణకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని, జీహెచ్ఎంసీని సూటిగా ప్రశ్నించింది. ఈ కేసు మార్చి16న ధర్మాసనం ఎదుట పునర్విచారణకు రానున్నప్పటికీ, కుక్కలను కట్టడి చేయడంలో గోవా విధానాన్ని ఆదర్శంగా తీసుకోవడంలో ప్రభుత్వం ముందుకు వచ్చినప్పుడే పిల్లలకు రక్షణ అందుతుంది.

అడుగు బయట పెట్టాలంటే భయం

చిన్నారులు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇంటిముందుకు వస్తే కుక్కలు దాడిచేసి కరుస్తున్నాయి. కుక్కకాటుకు గురైన చిన్నారులు, వారి కుటుంబీకులు కోలుకోలేకపోతున్నారు. కొంతమంది ప్రాణాలు కోల్పోతుండగా, మరికొందరు ఆసుపత్రుల్లో రోజుల తరబడి చికిత్స పొందుతున్నారు. వీధుల్లో స్వైరవిహారం చేస్తున్న కుక్కలకు ఆహారం ప్రధాన సమస్యగా మారింది. ఎవరైనా జాలి తలిస్తే తినడం, లేదంటే చెత్తకుండీలను వెతుక్కోవడం. ఏమీ దొరక్కపోతే ఆకలితో అలమటించడం వాటికి అలవాటుగా మారింది. దీనికితోడు వేసవి ఎండలతో డిహైడ్రేషన్ సమస్యలతో విచక్షణ కోల్పోతున్నాయి. సాధారణంగా కుక్కలు మనుషులను చూడగానే భయపడుతాయి. అక్కడి నుంచి పారిపోతాయి. కొన్నిసార్లు మాత్రం తిరిగి దాడి చేసే ప్రయత్నం చేస్తాయి. కొంతమంది చొరవ చూపి వీటికి ఆహారం, నీళ్లు, ఖాళీ ప్రదేశంలో షెల్టర్ ఇవ్వడం వల్ల విశ్వాసబద్ధంగా ఉంటాయి. గుంపులుగా ఉన్నా, ఒంటరిగా ఉన్నా కుక్కలతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. వీధిలో వెడుతున్నప్పుడు కుక్క అరిస్తే, వాటి జోలికి వెళ్లకుండా, వాటి కళ్లలోకి చూడకుండా మెల్లిగా నడుచుకుంటూ పోవాలి. వాటి దాడి తప్పదనుకుంటే మన చేతిలో ఏ వస్తువు ఉన్నా, దాన్ని ఉపయోగించాలి. రుగులు పెట్టకుండా వెనక్కి నడుస్తూ వాటిని అదిలిస్తుండాలి.

- కోడం పవన్​ కుమార్, సీనియర్​ జర్నలిస్ట్​