బంగ్లాదేశ్ మరోమారు అల్లర్లతో అట్టుడుకుతోంది. తాజాగా రేగిన హింసాత్మక ఘటనల్లో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో దేశ వ్యాప్త కర్ఫ్యూను ప్రకటించారు. బంగ్లాదేశ్ రాజధాని నగరం ఢాకా కూడా విద్యార్థుల నిరసనలతో హింసాత్మకంగా మారింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు టియర్ గ్యాస్ను ప్రయోగించారు. వేల మంది విద్యార్థులు రోడ్ల మీదకొచ్చి నిరసన తెలపడం, షాపులకు నిప్పు పెట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులను చెదరగొట్టేందుకు స్టన్ గ్రనేడ్స్ కూడా పోలీసులు ఉపయోగించారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి బంగ్లాదేశ్ ప్రభుత్వం నిరవధిక దేశవ్యాప్త కర్ఫ్యూను విధించింది. గత నెలలో కూడా అల్లర్లు హింసకు దారితీసినప్పటికీ దేశవ్యాప్త కర్ఫ్యూ లాంటి కీలక నిర్ణయం బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకోవడం ఇదే తొలిసారి. బంగ్లాలో పరిస్థితులు హింసాత్మకంగా తయారవడంతో అక్కడ ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
విద్యార్థుల ఆందోళన కారణంగా గత నెలలో రేగిన హింసాత్మక ఘటనల్లో దాదాపు 200 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్య్ర సమరయోధుల వారసుల కోటా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అక్కడి స్టూడెంట్లు చేస్తున్న ఆందోళనలు గత నెలలో హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. రాజధాని ఢాకాతో పాటు కొన్ని నగరాల్లో విద్యార్థులకు, అధికార పార్టీ అవామీ లీగ్ స్టూడెంట్ వింగ్ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరిగాయి. కొన్ని వారాల పాటు ఆందోళనలు కొనసాగాయి. కట్టెలు, ఇటుకలతో పరస్పరం దాడులు చేసుకుంటున్నారు.
బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోసం 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో చాలా మంది చనిపోయారు. అమరులైన వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు 1972లో ఆ దేశ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ ప్రకటించారు. వంద శాతంలో 44% మెరిట్ ఆధారంగా, 56 శాతం రిజర్వేషన్ల పరంగా (30శాతం అమరుల కుటుంబాలకు) ఉద్యోగాల భర్తీకి నిర్ణయించారు. కాగా, రిజర్వేషన్లలో సంస్కరణలు తీసుకురావాలని స్టూడెంట్లు నిరసన చేపడ్తున్నారు. గత నెల జూన్ 5న 30శాతం కోటాను పునరుద్ధరిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పు.. షేక్ హసీనా మద్దతుదారులకు ప్రయోజనం చేకూరుస్తున్నదని స్టూడెంట్లు వాదిస్తున్నారు. మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఆగస్టు 7న విచారించనుంది. కోర్టు విచారణ సమీపించడంతో మరోమారు బంగ్లాదేశ్ అల్లర్లతో అట్టుడుకుతుండటం గమనార్హం.