మల్లూరులో గుప్త నిధుల తవ్వకం కలకలం పోలీసుల అదుపులో ముఠా!

మంగపేట, వెలుగు :  మల్లూరులోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం సమీపంలో ని  పోడు భూమిలో గుప్త నిధుల తవ్వకాలు చేస్తున్న ముఠాను గురువారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.  మల్లూరు  సమీపంలో గత కొంత కాలంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హేమాచల క్షేత్రం అడవి ప్రాంతంతో పాటు,  క్షేత్రం పైన  ఉన్న రాతికోట ప్రాంతంలో  కూడా తవ్వకాలు జరుపుతున్నారని సమాచారం.

గుడి సమీపంలోని  పోడు భూమిలో గుప్త నిధుల కోసం తవ్వకాలు  జరిపినట్టుగా గుంతలు, పసుపు, కుంకుమ ,కల్లు సీసాలు ఉన్నాయి. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు నిఘా వేసి పది మంది సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.  ఈ ముఠాలో  ఓ ఫారెస్ట్ అధికారి కూడా ఉన్నట్టు ప్రచారం   సాగుతోంది.