వరంగల్లో బైక్​ దొంగల ముఠా అరెస్ట్

వరంగల్లో బైక్​ దొంగల ముఠా అరెస్ట్

కాశీబుగ్గ, వెలుగు : బైక్ దొంగల ముఠాను ప్రత్యేక క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం వరంగల్ ఇంతేజార్​గంజ్ పోలీస్​ స్టేషన్​లో  ఏర్పాటు చేసిన ప్రెస్​ మీట్​లో వరంగల్​ ఏసీపీ నందిరామ్ నాయక్ వివరాలు వెల్లడించారు. వరంగల్ ఇంతేజార్​గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు నెలల నుంచి బైక్ దొంగతనాలు జరుగుతున్నాయని బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ప్రత్యేక క్రైమ్ పార్టీని ఏర్పాటు చేశామన్నారు. ఆ ప్రత్యేక టీం గురువారం వరంగల్ చౌరస్తా, పోస్ట్ ఆఫీస్ ల వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా, ముగ్గురు వ్యక్తులు బైక్​పై వెళ్తూ తారసపడ్డారు.

పోలీసులను చూసి పారిపోతుండగా, పట్టుకుని విచారించగా రంగు ప్రశాంత్, ఈసెంఎల్లి ప్రేమ్ కుమార్, ఓ మైనర్ బాలుడిగా గుర్తించామన్నారు. వారు మద్యం, జల్సాలకు అలవాటు పడి ముఠాగా ఏర్పడ్డారని, సులభంగా డబ్బు సంపాదించాలని బైక్​ దొంగతనం నిశ్చయించుకొన్నట్లు తెలిపారు. వరంగల్ సెంట్రల్ జోన్ పరిధిలోని మిల్స్ కాలనీ, ఇంతేజార్ గంజ్, మట్టేవాడ, సుబేదారి, హన్మకొండలో మూడు నెలల నుంచి మొత్తం 8 మోటర్ సైకిల్స్ దొంగతనం చేసి, నష్కల్ గ్రామానికి చెందిన రంగు ప్రశాంత్ ఇంటి వద్ద ఉన్న నరసింహారావు హాస్పిటల్ దగ్గర పార్కింగ్ లాగా ఏర్పాటు చేశాడు.

తెలిసిన వారికి మాటలు చెప్తూ తక్కువ ధరకు బైకులు అమ్ముతున్నారు. గురువారం మూడు బైక్​లను ఇవ్వడానికి వెళ్తుండగా, పోలీసులకు పట్టుబడ్డారు. మిగతా 5 బైక్​లను నరసింహారావు హాస్పిటల్ దగ్గర పోలీసులు స్వాధీనపరుచుకుని, రూ. 10 వేలు సీజ్ చేసి అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపినట్లు ఏసీపీ తెలిపారు. దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన వారిని ఏసీపీ అభినందించారు.