అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్​

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: జిల్లాలో కొంత కాలంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్​జిల్లా దొంగల ముఠాను పట్టుకున్నట్లు ఎస్పీ ఉదయ్​కుమార్​రెడ్డి అన్నారు. సోమవారం మావల పోలీస్​స్టేషన్​లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని తాటిగూడకు చెందిన  సయ్యద్ ఫారూక్ (మేస్ర్తీ), వడ్డెర కాలనీకి చెందిన టెంపు సురేశ్(ఆటోడ్రైవర్​), కేఆర్​కే కాలనీకి చెందిన మాడే రతన్, మంచిర్యాలకు చెందిన షేక్​అక్బర్(మేస్ర్తీ), మహారాష్ట్ర గోకుంద కిన్వట్​కు చెందిన బాలాజీ అభిమాన్ మన్య, కిన్వట్​కు చెందిన ఆదిల్ చోరీలకు పాల్పడడ్డారని వెల్లడించారు. వారిని అరెస్టు చేసి వారి నుంచి రూ.10 లక్షల విలువ ఉన్న 19 బైకులు, 5 గ్రాముల బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి సామాగ్రితో పాటు 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. దొంగల ముఠాను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్​ఐ వి.విష్ణువర్ధన్, సిబ్బంది జె.సవిత, ఎమ్​ఏ.కరీం, శివాజీలను ఎస్పీ అభినందించారు. 

ఇచ్చోడ: లీజుకు తీసుకొచ్చిన జేసీబీని అమ్మకానికి తీసుకెళ్లిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ నాగేందర్ తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం సికింద్రాపూర్ కు చెందిన నరేందర్ జేసీబీని సులేమాన్, ముంతాజ్ లీజుకు తీసుకొచ్చి ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్ లో పనులు చేస్తున్నారు. వీరితో పాటు శాహిద్, మహమ్మద్, రాహుల్ ఉన్నారు. ఫిబ్రవరి 28న జేసీబీని అమ్మేందుకు మహారాష్ట్రలోని పాండ్రకోడకు తీసుకెళ్లి, తమ ఫోన్లను స్వీచ్ఆఫ్​చేసుకున్నారు. ఇదే విషయమై గత నెల 13న బాధితుడు ఇచ్చోడ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మూడు గ్రూపులుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానంతో విచారణ చేపట్టారు. జేసీబీని అమ్మే ప్రయత్నంలో ఉన్న సులేమాన్ ను​నిర్మల్ బైపాస్ వద్ద పోలీసులు పట్టుకొని విచారించగా నిజం ఒప్పుకొని జేసీబీ ఆచూకీ తెలిపారు. సోమవారం నిందితులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. సమావేశంలో సీఐ నైలు, ఎస్ఐ శ్రీకాంత్, సిబ్బంది, చంద్రమౌళి, దత్తాత్రి ఉన్నారు.