సింగరేణిలో ఉద్యోగాల పేరిట మోసాలు
డబ్బులు వసూలు చేసిన ముఠా సభ్యున్ని పట్టుకున్న బాధితులు
సీనియర్ ఆఫీసర్ల పేరుతో పైరవీల దందా
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని, ట్రాన్స్ఫర్ చేయిస్తామని ఎంప్లాయీస్‌ను, నిరుద్యోగులను మోసగించిన ముఠా గుట్టురట్టయ్యింది. శుక్రవారం రాత్రి సింగరేణి హెడ్ క్వార్టర్‌కు వచ్చిన ఈ ముఠాకు చెందిన వ్యక్తిని బాధితులు పట్టుకుని తమ దగ్గర వసూలు చేసి డబ్బులు వాపసు ఇవ్వాలని నిలదీశారు. గోదావరిఖనికి చెందిన జి. రోహిత్ అనే వ్యక్తి మరో ఐదుగురితో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు. ఇందులో ఒక యువతి కూడా ఉంది. ఎమ్మెల్సీ కవిత నిర్వహిస్తున్న జాగృతి సంస్థలో వివిధ హోదాల్లో పని చేసిన రోహిత్ సింగరేణిలో ఉన్నతాధికారులతో సంబంధాలున్నాయని, సంస్థలో ఏ పనైనా చిటికెలో చేస్తామంటూ అమాయకులను నమ్మించారు. వీరికి కొందరు యూనియన్ నేతలతోనూ సంబంధాలున్నట్టు తెలుస్తోంది.
ఈ ముఠా సభ్యులు తరచూ కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్‌కు వస్తూ పైరవీలు చేస్తున్నారు. రోహిత్ ముఠా కొత్తగూడెంలోని ఓ యువకుడికి ఫిట్టర్ బేస్‌గా ఉద్యోగం ఇప్పిస్తామని ఏడాది కింద రూ. 15లక్షలకు ఒప్పందం చేసుకుని, రూ. 2లక్షలు అడ్వాన్స్‌గా తీసుకుంది. మరో మహిళ కొడుకుకు ఉద్యోగం ఇప్పిస్తామంటూ రూ. 15లక్షలకు ఒప్పందం చేసుకొని ఏడాదిన్నరలో మూడు విడతల్లో రూ. 7లక్షలు, మరో యువకుడి నుంచి రూ .15 లక్షలు తీసుకున్నారు. కొత్తగూడెం, భూపాలపల్లి, మందమర్రి, గోదావరిఖని, శ్రీరాంపూర్ తదితర ప్రాంతాల్లో ఉద్యోగాలు, ట్రాన్స్ఫర్, మెడికల్ బోర్డు పేర రూ.కోట్లలో వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి.
రోహిత్‌తో పాటు ఒక యువతి హెడ్డాఫీస్లో తరచూ జీఎం పర్సనల్, జీఎం వెల్ఫేర్‌ను కలుస్తూ నిరుద్యోగులను నమ్మించారు. సింగరేణికి చెందిన పలువురు సీనియర్ ఆఫీసర్ల సంతకాలను ఫోర్జరీ చేసి నిరుద్యోగులను మోసగించినట్టు తెలుస్తోంది. గోదావరిఖని ఏరియాకు చెందిన ఓ కార్మికుడికి మెడికల్ ఫిట్నెస్ ఇప్పించేందుకు శుక్రవారం సింగరేణి హెడ్డాఫీస్‌కు వచ్చిన రోహిత్‌ను బాధితులు పట్టుకున్నారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీశారు. గోదావరిఖని నుంచి వచ్చిన రోహిత్ సంబంధీకులు బాధితులతో మాట్లాడుతున్నారు. తమను మోసగించి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోతే కేసు పెడతామని బాధితులు చెప్తున్నారు.