కార్లల్లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి మూడు కార్లు, 55 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జి పాయింట్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. అక్కడే అనుమానాస్పదంగా ఉన్న మూడు కార్లను ఆపి.. తనిఖీలు చేయడంతో గంజాయి బ్యాగులు బయటపడ్డాయి. వెంటనే కార్లల్లో ఉన్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని.. ఎక్సైజ్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఒడిస్సా నుండి హైదరాబాద్ కు గంజాయి తరలిస్తుండగా పట్టుబడ్డారు.