గోడౌన్‎లో పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

గోడౌన్‎లో పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

మద్దూరు, వెలుగు: గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఒకరు  చనిపోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యా యి. ఈ ఘటన నారాయణపేట జిల్లా మద్దూరులోని హెచ్‌పీ గ్యాస్‌ గోడౌన్‌లో ఆదివారం జరిగింది. ఎస్ఐ రాంలాల్‌ తెలిపిన ప్రకారం.. గుండుమాల్‌ మండల కేంద్రానికి చెందిన హంసం నరేశ్‌ (22), కేశపోల్ల కృష్ణ, కోయిలకొండ మండలంలోని అభంగపట్నంకు చెందిన తంటం నవీన్‌ మద్దూరు హెచ్‌పీ గ్యాస్‌ గోడౌన్‌లో పని చేస్తున్నారు. శనివారం అర్ధరాత్రి  గోడౌన్‌లో పని చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్‌ పేలింది. 

దీంతో నరేశ్‌ చనిపోగా, కృష్ణ, నవీన్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు నవీన్‌ ను హైదరాబాద్‌కు, కృష్ణయ్యను మహబూబ్‌నగర్‌ హాస్పిటల్‌కు తరలించారు. ఆర్‌ఐ ఆనంద్‌, ఎస్ఐ రాంలాల్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. రీ ఫిల్లింగ్‌ చేస్తున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఏజెన్సీ డీలర్లు శ్రీనివాస్, నారాయణ, చంద్రప్ప, శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.