రైలు పట్టాలపై సిలిండర్.. ట్రైన్ వచ్చేసింది.. చివరకు ఏం జరిగిందో చూడండి..

రైలు పట్టాలపై సిలిండర్.. ట్రైన్ వచ్చేసింది.. చివరకు ఏం జరిగిందో చూడండి..

ఉత్తరప్రదేశ్: యూపీలో ఆకతాయిల ఆగడాలు రోజురోజుకూ శ్రుతి మించిపోతున్నాయి.  రైలు పట్టాలపై 5 లీటర్ల గ్యాస్ సిలిండర్ను ఉంచిన ఘటన ఉత్తరప్రదేశ్లో కలకలం రేపింది. రైలు నడుపుతున్న లోకో పైలట్లు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ఘటన కాన్పూర్, ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. ఎమర్జెన్సీ బ్రేక్స్ వేసి గూడ్స్ రైలును లోకో పైలట్లు నిలిపివేశారు. ఆదివారం తెల్లవారుజామున 5:50 నిమిషాల సమయంలో ప్రేమ్పూర్ స్టేషన్ దగ్గర్లో ఈ ఘటన జరిగింది. రైల్వే పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

దేశంలో గత నెల రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన ఆరోసారి వెలుగులోకి రావడం అనుమానాలకు తావిస్తోంది. ఈ తరహా చిన్న సిలిండర్లు రూమ్స్లో, హాస్టల్స్లో ఉండే విద్యార్థులు, భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు ఎక్కువగా వినియోగిస్తుంటారు. సిగ్నల్కు కేవలం 30 మీటర్ల దూరంలో ఈ గ్యాస్ సిలిండర్ పట్టాలపై కనిపించింది. యూపీలో సెప్టెంబర్ 8న కూడా ఇదే తరహా ఘటన జరిగింది. సెప్టెంబర్ 8న రాత్రి భివానికి వెళుతున్న కాళింది ఎక్స్ ప్రెస్ పేలుడుకు కుట్ర జరిగింది.

లోకో పైలట్ పట్టాలపై గ్యాస్ సిలిండర్ను గమనించి రైలును ఆపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ కేసును కాన్పూర్ పోలీసులు ఇప్పటికీ  ఛేదించలేకపోవడం గమనార్హం. ఆదివారం యూపీలో పట్టాలపై గ్యాస్ సిలిండర్ వెలుగుచూసిన ఘటనలో సిలిండర్ ఖాళీదేనని పోలీసులు గుర్తించారు. లోకో పైలట్లు దేవ్ ఆనంద్ గుప్తా, సీబీ సింగ్ ఈ గూడ్స్ రైలును నిలిపివేసి ప్రమాదాన్ని తప్పించారు.