- 60 ఏండ్ల నుంచి చదువుకున్న పూర్వ విద్యార్థుల కలయిక
కందనూలు, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో విద్యాసంస్థల వజ్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 1963 నుంచి-2023 వరకు చదువుకున్న పూర్వవిద్యార్థులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. న్యూఢిల్లీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సెక్రటరీ మనీశ్ జోషి, పాలమూరు యూనివర్సిటీ వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ చీఫ్ గెస్ట్లుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మనీశ్ జోషి మాట్లాడుతూ పాలెం గ్రామాన్ని ఎలాంటి పురోగతి లేని సమయంలో విద్యానిలయంగా మార్చిన తోటపల్లి సుబ్బయ్య (తోటపల్లి సుబ్రహ్మణ్య శర్మ) వ్యక్తి కాదు ఓ అసాధారణ శక్తి అని కొనియాడారు. నాలుగో తరగతి వరకే చదువుకున్న సుబ్బయ్య విద్యకు ఉన్న ప్రాధాన్యతకు గుర్తించి విద్యాసంస్థలను నెలకొల్పడం వెనక ఆయనకు చదువుపై ఉన్న మమకారాన్ని తెలియజేస్తుందన్నారు.
60 ఏండ్లుగా వేలాది మంది విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దిన ఆయన సేవలు అనిర్వచనీయమన్నారు. పల్లెటూర్లలో పట్నం తరహా కాలేజీ నిర్మించిన ఆయన కృషిని కొనియాడారు. పూర్వ విద్యార్థులు ఒక్కచోట చేరి సుబ్బయ్యను స్మరించుకోవడం హర్షణీయమన్నారు. కాలేజీ అభివృద్ధికి తనవంతు సహాయ, సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. పాలెం కాలేజీలో నూతన కోర్సులు, ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సులను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు.
సుబ్బయ్య కూతురు సుచిత్ర మాట్లాడుతూ.. డిగ్రీ తరువాత పోటీ పరీక్షలు, పీజీలకు స్థానిక యువత నేటికీ ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, ఉన్నత స్థానంలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు పోటీ పరీక్షలకు పాలెంలోనే కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి మాట్లాడుతూ పూర్వ విద్యార్థులను కలవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం 60 ఏండ్ల నివేదికను ఆవిష్కరించారు. మోహన్ బాబు, బుద్దయ్య, మల్లికార్జున్, కృష్ణాగౌడ్, గాడి సురేందర్, శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ గోపాల్ పాల్గొన్నారు.