ఆడపిల్ల పుట్టిందని వదిలించుకున్నరు!

ఆడపిల్ల పుట్టిందని వదిలించుకున్నరు!
  • గిరిజన దంపతులను విచారించిన సీడబ్ల్యూసీ అధికారులు 
  • పసిపాపను స్వాధీనం చేసుకుని శిశు గృహకు తరలింపు 

యాదాద్రి, వెలుగు : మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టిందని తల్లిదండ్రులు దత్తత ఇచ్చి వదిలించుకున్నారు. ఇది కాస్త చైల్డ్​వెల్ఫేర్ ఆఫీసర్లకు తెలియడంతో చిన్నారిని స్వాధీనం చేసుకుని శిశుగృహకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం రాంపూర్​తండాకు చెందిన గిరిజన దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొడుకు కోసం మూడోసారి భార్య గర్భం ధరించింది. గత నెల 2న  హైదరాబాద్​లోని మెడిసిటీ హాస్పిటల్​లో పాప పుట్టింది.

మళ్లీ ఆడపిల్లనే పుట్టడంతో నిరాశతో దంపతులు తండాకు చెందిన తెలిసిన వ్యక్తి ద్వారా సిద్దిపేట జిల్లా గజ్వేల్​కు చెందిన పిల్లలు లేని ఓ జంటకు దత్తత ఇచ్చారు. ఇటీవల తండాకు వచ్చిన గిరిజన దంపతులను అంగన్​వాడీ సిబ్బంది వెళ్లి వివరాలు అడిగారు. పాప హాస్పిటల్ లో ఉందంటూ చెప్పగా అనుమానంతో ఆరా తీసి నిలదీయడంతో దత్తత ఇచ్చినట్టు తెలిపారు. అక్రమ దత్తత  నేరమని, వెంటనే పాపను తీసుకొని రావాలని దంపతులకు సూచించారు.

దీంతో గజ్వేల్​కు వెళ్లి పాపను తీసుకొచ్చి మంగళవారం రాత్రి ఐసీడీఎస్ ఆఫీసులో అప్పగించారు. అనంతరం సీడబ్ల్యూసీ చైర్మన్​ బండారు జయశ్రీ, మెంబర్స్​ పాపను దత్తత ఇచ్చిన దంపతులను, పొందిన భార్యభర్తలను  ప్రశ్నించినా సరైన వివరాలు చెప్పలేదు.  దీనిపై మరింత విచారణ జరిపిన తర్వాత పాపను అప్పగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అనంతరం పాపను శిశు గృహకు తరలించారు.