
బెల్లంపల్లి రూరల్, వెలుగు: వేసవి సెలవులకు అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఓ బాలిక ఛాతినొప్పితో ఆర్ఎంపీ దగ్గరకు వెళ్లగా అతడు ఇంజక్షన్వేయడంతో చనిపోయింది. నీల్వాయి ఎస్సై శ్యాంపటేల్ కథనం ప్రకారం..మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రానికి చెందిన కొమిరె శ్రీనివాస్, -భాగ్యలక్ష్మి దంపతుల బిడ్డ సాయిపల్లవి(11) వేసవి సెలవులకు అమ్మమ్మ ఊరైన వేమనపల్లి మండలంలోని కల్మలపేటకు వచ్చింది.
ఆదివారం రాత్రి ఛాతిలో నొప్పి వస్తోందని చెప్పడంతో నీల్వాయిలో ఉండే ఆర్ఎంపీ డాక్టర్సంతోష్వద్దకు తీసుకువెళ్లారు. అతడు ఇంజక్షన్ వేసిన కొద్ది సేపటికే బాలిక పల్స్, బీపీ పడిపోయింది. దీంతో చెన్నూర్ ప్రభుత్వ దవాఖానకు, అక్కడి నుంచి మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకువెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం చనిపోయింది. ఆర్ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యం వల్లే తన బిడ్డ చనిపోయిందని తల్లి భాగ్యలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.