స్టూడెంట్​ ఎన్నికలతో..మంచి లీడర్లు వస్తరు!

చదువుకుంటూనే.. సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకుంటూ అసాంఘిక శక్తులపై పోరాటం చేసేవాడు విద్యార్థి. అతని నిస్వార్థపు ఆలోచనలు, చర్యలు దేశ నిర్మాణానికి, ప్రగతికి దోహదం చేస్తాయి. ఇలా యూనివర్సిటీల్లో విద్యార్థి యూనియన్​నేతలుగా ఎదిగిన అనేక మంది దేశానికి ప్రధానులు, రాష్ట్రపతులు, ఆయా రాష్ట్రాలకు సీఎంలుగా ప్రజలకు సేవ చేశారు. ప్రస్తుతం సెంట్రల్​వర్సిటీలు, ఆయా రాష్ట్రాల్లో కొన్ని చోట్ల తప్పితే.. ప్రభుత్వాలు విద్యార్థి యూనియన్​ ఎన్నికలు నిర్వహించడం లేదు. దీంతో సమాజానికి, దేశానికి నిస్వార్థంగా పనిచేసేందుకు రాజకీయాల్లోకి వచ్చే నాయకులు తగ్గిపోతున్నారు. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం ప్రభుత్వాలు ఇప్పటికైనా విద్యార్థి యూనియన్​ ఎన్నికలు నిర్వహించాలి.

ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి సారిగా 1832లో హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యార్థి యూనియన్ ఎలక్షన్స్ జరిగాయి. మనదేశంలో 1936లో ఆలిండియా స్టూడెంట్ ఫెడరేషన్ ప్రారంభించారు. విద్యార్థి యూనియన్ ఎన్నికల జరిగిన కాలంలో విద్యా వ్యవస్థను పరిశీలిస్తే.. నాయకులు, విద్యార్థులందరూ సామాజిక స్ప్రృహతో చైతన్యంగా ఉండేవారు. అందువల్లే ప్రాథమిక పాఠశాల మొదలు యూనివర్సిటీల వరకు విద్యార్థి, టీచర్ నిష్పత్తి ప్రకారం నిరంతరం అధ్యాపకుల నియామకాలు జరిగేవి. నాణ్యమైన విద్యా బోధన డిమాండ్​చేయడంతోపాటు కాలేజీ, హాస్టల్ ఫీజులు సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వంతో పోరాటం చేసేవారు. విద్య ప్రైవేటీకరణకు, వ్యాపారీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిచేవి. ప్రశ్నించే తత్వం ప్రతి విద్యార్థిలో ఉండటంతో విద్యాసంస్థలు బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో పనిచేసేవి. అటు సామాజిక ఉద్యమాల్లోనూ విద్యార్థులు కీలక పాత్ర పోషించేవారు.

ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్​లో విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ కోసం జరిగిన పోరాటంలో ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అంటూ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా తెగించి కొట్లాడిన్రు. ఈ పోరాటాలు సమాజం పట్ల విద్యార్థి నాయకులకు, విద్యార్థులకు ఉన్న నిబద్ధతను తెలియజేస్తాయి. దేశంలో ప్రస్తుతం రాజకీయ ప్రభావం లేని వ్యవస్థ అంటూ లేదు. ప్రస్తుతం చాలా మంది రాజకీయ నాయకులు దేశం, ప్రజల కంటే వారి స్వప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తూ.. కుల, మత, ప్రాంతీయ భావాలను రెచ్చగొడుతున్నారు. వారు పదవుల్లో ఉండగానే వారి వారసులను రాజకీయరంగ ప్రవేశం చేయించి, భవిష్యత్తు తరాలపై వారి వారసులనే రాజకీయ నాయకులుగా బలవంతంగా రుద్దుతున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే తరహా రాజకీయం నడుస్తోంది. ఈ పోకడలను మనం ప్రోత్సహించినా, కొనసాగించినా ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా మారి.. రాచరికం వైపు దారితీసే ప్రమాదం ఉంది.

వీళ్లంతా విద్యార్థి నేతలే..

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలా కాలంపాటు సాధారణ ఎన్నికలతో సమాంతరంగా విద్యార్థి యూనియన్ ఎన్నికలు కూడా నిర్వహిస్తూ ఉండేవారు. తద్వారా విద్యార్థి యూనియన్ నుంచి గొప్ప నాయకులు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లోకసభ స్పీకర్ గా చేసిన జీవీఎంసీ బాలయోగి, ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. మెరుగా నాగార్జున, ఎర్రం నాయుడు, హరిబాబు తదితరులు ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం నుంచి విద్యార్థి నాయకులుగా ఎదిగారు. మాజీ సీఎం దామోదర్ సంజీవయ్య మద్రాస్ లా కాలేజీ నుంచి, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీవేంకటేశ్వర వర్సిటీ నుంచి, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, జైపాల్​రెడ్డి, ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి, ఎన్. భాస్కరరావు, ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్​ఓయూ నుంచి విద్యార్థి నాయకులుగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. దేశంలోనే అత్యధిక రాజకీయ నాయకులను దేశానికి, రాష్ట్రానికి అందించిన వర్సిటీగా ఓయూది ప్రత్యేక స్థానం. అలహాబాద్ వర్సిటీ నుంచి మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్​ శర్మ, మాజీ ప్రధాన మంత్రులు చంద్రశేఖర్, వీపీ సింగ్ వచ్చారు. అస్సాం రాష్ట్రంలోని గౌహతి యూనివర్సిటీ ‘ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్’ నుంచి ప్రఫుల్ల కుమార్ మొహంత రాజకీయాల్లోకి వచ్చారు. ప్రఫుల్ల కుమార్​ఏకంగా యూనివర్సిటీ హాస్టల్ నుంచి అస్సాం రాష్ట్రానికి సీఎం అయ్యారు. ఇలా విద్యార్థి నాయకులుగా కీలక పాత్ర పోషించి, రాజకీయాల్లోకి వచ్చిన నేతలెందరో ఉన్నారు. అలాంటి వారిలో ఎక్కువమందికి రాజకీయ కుటుంబ నేపథ్యం లేదు. వారి నాయకత్వ లక్షణాలు, సామర్థ్యం, సమాజం పట్ల వారికి ఉన్న బాధ్యతే వారిని రాజకీయ నాయకులుగా చేసింది.1980 నుంచి1985 మధ్య కాలంలో వివిధ రాష్ట్రాల్లో విశ్వవిద్యాలయాల్లో జరిగిన కొన్ని హింసాత్మక సంఘటన వల్ల విద్యార్థి యూనియన్ ఎన్నికలను ప్రభుత్వాలు రద్దు చేశాయి.

2005లో ఎన్నికలపై కమిటీ

సుప్రీంకోర్టు 2005 డిసెంబర్ 2న ఇచ్చిన ఆదేశాల ప్రకారం కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ కేంద్రం మాజీ ముఖ్య ఎన్నికల అధికారి జేఎం లింగ్డో అధ్యక్షతన ఒక కమిటీ వేసింది. విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో విద్యార్థుల యూనియన్ ఎలక్షన్లను సమీక్షించి తగిన సూచనలు చేయాలని కమిటీని నియమించింది. కమిటీ 2006 మే 26న రిపోర్ట్ ను సమర్పించింది. అదే ఏడాది సెప్టెంబర్ 22న సుప్రీంకోర్టు కమిటీ ప్రతిపాదించిన రిపోర్టును అమలు చేయాలని యూనివర్సిటీలకు, కాలేజీలకు సూచించింది. విద్యార్థి ఎన్నికల నిర్వహణకు సంబంధించి కమిటీ చాలా సూచనలు చేసింది. ఏటా విద్యాసంవత్సరం మొదలైన 6 నుంచి 8 వారాల మధ్యలో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలి. ఈ ప్రక్రియ మొత్తం10 రోజుల వ్యవధి మించకుండా పూర్తి చేయాలి. దేశంలో ఉన్న యూనివర్సిటీల్లో విద్యార్థి ఎన్నికలు నిర్వహించడానికి శాంతి, స్వేచ్ఛాయుతమైన వాతావరణం ఏర్పాటు చేయాలి. పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే ఆయా వర్సిటీల్లో నామినేషన్ పద్ధతిలో విద్యార్థి ప్రతినిధులను ఎన్నుకోవాలి. ఐదు సంవత్సరాల తర్వాత నామినేషన్ పద్ధతి నుంచి నిర్మాణాత్మకమైన ఎన్నికల విధానానికి రావాలి. అంటే పార్లమెంటరీ(పరోక్ష) లేదా అధ్యక్ష(ప్రత్యక్ష) లేదా రెండు కలిపిన ఎన్నికల విధానం అనుసరించాలి. విద్యార్థి సంఘాల్లో ప్రతినిధులుగా రెగ్యులర్ విద్యార్థులు మాత్రమే ఉండాలి. విద్యార్థి సంఘాల ప్రతినిధులు రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా పని చేయాలి. విద్యార్థి ఎన్నికలకు సంబంధించి ఇండియన్ పీనల్ కోడ్ 1860 సెక్షన్ 153 ఏ అండ్ చాప్టర్ 9ఏ  ఎఫెన్సెస్ రిలేటింగ్ టు ఎలక్షన్ అమలు చేయొచ్చు. 

విద్యార్థుల నుంచే లీడర్లు రావాలె..

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2006లో  జేఎం లింగ్డో కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఐదేండ్లు నామినేషన్ పద్ధతిలో విద్యార్థి నాయకులను ఎన్నుకుని, ఆ తర్వాత విద్యార్థి యూనియన్ ఎలక్షన్స్ నిర్వహించాల్సి ఉండే. కానీ కోర్టు ఆదేశించి16 ఏండ్లు గడచినా అది చాలా రాష్ట్రాల్లో ఆచరణలోకి రాలేదు. కేంద్ర విశ్వవిద్యాలయాలైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ, రాష్ట్రస్థాయిలో కేరళ, పశ్చిమబెంగాల్, అస్సాం, రాజస్థాన్, పంజాబ్ తదితర వర్సిటీల్లో కొన్నిచోట్ల మాత్రమే విద్యార్థి యూనియన్ ఎలక్షన్ నిర్వహిస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో ఇప్పటివరకు విద్యార్థి యూనియన్ ఎలక్షన్స్ కు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీని వల్ల విద్యార్థుల్లో సామాజిక, రాజకీయ, ఆర్థిక చైతన్యం లేకుండా పోతోంది. విద్యలో ప్రైవేటీకరణ, ఫీజుల దోపిడీ, ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు, నిరుద్యోగం, కులం, మతం, ప్రాంతాల పేరుతో విద్వేషాలు సృష్టించడం ఇలా విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేసే అనేక వైపరీత్యాలు జరుగుతున్నా.. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు కనీసం వారి హక్కుల కోసం గళం ఎత్తలేని అచేతన స్థితిలో ఉంటున్నారు. ప్రశ్నించే తత్వం తగ్గిపోతోంది. ఆలోచించి, పరిశోధించి సమస్యలకు పరిష్కారం చూపే విద్యార్థి మేధావులు, నాయకులు లేకపోవడం వల్లే ఇన్ని అనర్ధాలకు కారణమని తెలుస్తోంది. ఇప్పటికైనా విశ్వవిద్యాలయాలు, కాలేజీలలో విద్యార్థి ఎన్నికలను నిర్వహించి ప్రజాస్వామ్యానికి అవసరమైన ప్రజానాయకులను, రాజకీయ నాయకులను, సామాజికవేత్తలను, ఆర్థికవేత్తలను, శాస్త్రవేత్తలను అందిస్తూ, వారసత్వపు రాచరిక పాలనలకు ముగింపు పలకాలి. 

ప్రస్తుతం విద్యార్థి సంఘాలు

మనదేశంలో రెండు రకాల విద్యార్థి సంఘాలు పనిచేస్తున్నాయి. మొదటి రకం విద్యార్థి సంఘాలు ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధ సంఘాలుగా పనిచేస్తున్నాయి. ఉదాహరణకు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్ యూఐ) కాంగ్రెస్ పార్టీకి, అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) బీజేపీకి, టీఆర్​ఎస్​వీ టీఆర్ఎస్ కు ఇలా అన్ని పార్టీలకు అనుబంధ విద్యార్థి సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలు ఎలాంటి కార్యాచరణ చేపట్టాలన్నా అందుకు సంబంధించిన సూచనలు ఆయా రాజకీయ పార్టీల నుంచి వస్తాయి. రెండో రకమైన విద్యార్థి సంఘాల్లో.. కుల, మత, ప్రాంత, వర్గ, భాష సారూప్యత/తేడాలతో ఐక్యమవుతుంటారు. ఓపెన్ క్యాటగిరి స్టూడెంట్స్ అసోసియేషన్, అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్, బిర్సా అంబేద్కర్ ఫూలే స్టూడెంట్స్ అసోసియేషన్, పేరియర్ అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్, దళిత స్టూడెంట్ ఫెడరేషన్, నేషనల్ దళిత్ స్టూడెంట్ ఫెడరేషన్, బ్యాక్ వర్డ్ స్టూడెంట్ ఫెడరేషన్, ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ లాంటివి. వీటికి ప్రత్యక్షంగా ఎటువంటి రాజకీయ పార్టీలతో సంబంధం ఉండదు. 
-  డా. బోరుగడ్డ సుబ్బయ్య, అసిస్టెంట్​ ప్రొఫెసర్, ఆంధ్రా యూనివర్సిటీ