రాజస్థాన్ లోని కోటాలో విషాదం
జైపూర్: ఆయన ఓ గవర్నమెంట్ సంస్థలో మేనేజర్....అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకునేందుకని వీఆర్ఎస్ తీసుకున్నారు. చివరగా ఆఫీసులో కొలీగ్స్ వీడ్కోలు పార్టీ ఇచ్చారు. కానీ ఆ పార్టీలోనే అతని భార్య గుండెపోటుతో కుప్పకూలి చనిపోయింది. రాజస్థాన్ లోని కోటాలో ఈ విషాద ఘటన జరిగింది. అప్పటివరకూ నవ్వుతూ ఫొటోలు దిగిన ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దేవేంద్ర సందాల్ అనే ఆ వ్యక్తి కోటాలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో మేనేజర్ గా పని చేస్తున్నారు. ఆయన రిటైర్మెంట్ కు మరో మూడేళ్ల గడువు ఉంది. అయితే, కొంతకాలంగా తన భార్య టీనా గుండె సంబంధ సమస్యతో బాధపడుతోంది. దీంతో ఆమెను చూసుకునేందుకని వీఆర్ఎస్ తీసుకున్నారు. ఇటీవల ఆఫీసులో ఆయనకు వీడ్కోలు చెప్పేందుకు కొలీగ్స్ పార్టీ అరేంజ్ చేశారు.
దేవేంద్ర, ఆయన భార్య టీనా ఇద్దరూ మెడలో బంతిపూల దండలు వేసుకుని, చేతిలో బొకేలు పట్టుకుని అందరితో కలిసి నవ్వుతూ ఫొటోలు దిగారు. ఇంతలో టీనాకు కండ్లు తిరిగాయి. చక్కర్ వస్తోందంటూ ఆమె కుర్చీలో కూలబడింది. ఆమె వీపుపై దేవేంద్ర మసాజ్ చేస్తూ.. నీళ్లు తీసుకురావాలని కొలీగ్స్ కు చెప్పడం.. చక్కర్ వచ్చింది, నీళ్లు తెండి అంటూ కొలీగ్స్ అరవడం వీడియోలో కనిపించింది. తర్వాత ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పారు.