నల్గొండ, వెలుగు : రాష్ట్రంలో వ్యవసాయంపై సర్కారుకు పట్టింపు లేకుండా పోతోంది. మూడేండ్ల నుంచి ప్రతి సీజన్లో ప్రకటనలు చేయడం తప్ప ఆచరణలో అడుగు ముందుకు పడడం లేదు. 2020 వానాకాలం సీజన్లో దొడ్లు వడ్లు పండించవద్దని చెప్పిన సర్కారు సన్నవడ్లు పండించిన రైతులకు కనీస మద్దతు ధర ఇప్పించలేకపోయింది. మరోసారి వరి, పత్తికి ప్రత్యామ్నాయంగా పప్పులు, నూనెగింజలు సాగుచేయాలని చెప్పినా అవసరమైన విత్తనాలు తెప్పించడంలో ఫెయిలైంది. సర్కారును నమ్మి పప్పులు, నూనెగింజలు, కూరగాయలు, పండ్లు సాగుచేసిన రైతులను మార్కెటింగ్ సమస్య వెంటాడింది. దీంతో మళ్లీ ఎప్పట్లాగే రైతులు వరి వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ ఏడాది ‘ముందస్తు సాగు’ అంటూ సర్కారు మరో కొత్త ప్రతిపాదన తెచ్చింది. కానీ, ఈసారి వర్షాలు ఆలస్యంగా రావడం, కనీసం నార్లు పోసుకునేందుకు ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఇవ్వకపోవడంతో ఈ ప్లాన్ కూడా వికటించినట్లయింది.
2020లో దొడ్డు రకం సాగు పైన ఆంక్షలు...
2020 వానకాలంలో సన్నాల సాగు పెంచాలనే లక్ష్యంతో దొడ్డు రకం వడ్ల సాగుపై రాష్ట్ర సర్కారు ఆంక్షలు విధించింది. సన్నాలు అధికంగా పండిస్తే క్వింటాకు అదనంగా రూ.100 చొప్పున చెల్లిస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. దొడ్డు రకం విత్తనాల సప్లై కూడా తగ్గించడం, మంత్రులు, ఎమ్మెల్యేల దగ్గరనుంచి కలెక్టర్లు, ఏఈవోల దాకా ప్రచారం చేయడంతో ఆ ఏడాది రైతులు24 లక్షల ఎకరాల్లో సన్నరకాలు సాగు చేశారు. కానీ దొడ్డురకాలతో పోల్చినప్పుడు సన్నరకాలకు చీడపీడలు ఎక్కువ కావడంతో పెట్టుబడులు పెరిగాయి. తీరా దొడ్డు వడ్లతో పోల్చినప్పుడు ప్రతి ఎకరాకు 5 క్వింటాళ్ల దిగుబడి తగ్గిపోయింది. దీంతో సన్నవడ్లకు క్వింటాల్‌కు రూ.400 నుంచి రూ.500 వరకు అధికంగా చెల్లించాలని రైతులు డిమాండ్ చేయగా, అప్పట్లో రూ.100 ఎక్కువ ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఆ హామీని కూడా నిలబెట్టుకోలేదు. దీంతో రైతులు ఎప్పట్లాగే దొడ్డు వడ్లకు మొగ్గుచూపుతున్నారు.
2021లో నూ పప్పులో కాలేశారు..
రాష్ట్రంలో వానాకాలం కోటి 50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతుండగా, అందులో 80శాతం భూముల్లో వరి, పత్తి పండిస్తున్నారు. కేవలం 20 శాతం భూముల్లోనే పండ్లు, కూరగాయలు, పప్పులు, నూనె గింజలు సాగవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్క కంది తప్ప మిగిలిన మెట్ట పంటలు సగటు విస్తీర్ణం కంటే తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు సగటున 5 లక్షల ఎకరాల్లో సాగయ్యే పల్లి ప్రస్తుతం 40 వేల ఎకరాలకు, 3.75లక్షల ఎకరాల్లో సాగయ్యే పెసర 2 లక్షల ఎకరాలకు, 7.5లక్షల ఎకరాల్లో సాగయ్యే సోయాబీన్ 1.5 లక్షల ఎకరాలకు పరిమితయ్యాయి. ఇక మక్క మీద సర్కారు కత్తి గట్టింది. మక్కలను కొనేది లేదని చెప్పడంతో ఒకప్పుడు14 లక్షల ఎకరాల్లో సాగయ్యే మక్క సగానికి సగం తగ్గిపోయింది. ఇక మిర్చి 2 లక్షల ఎకరాల్లో, కూరగాయలు లక్ష ఎకరాల్లో, అన్ని రకాల పండ్ల తోటలు కలిపి 5 లక్షల ఎకరాలకే పరిమితయ్యాయి. ఈ క్రమంలో వరి సాగు తగ్గించి పప్పులు, నూనెగింజల సాగు పెంచాలని 2021లో సర్కారు ప్రచారం చేసింది. గ్రామాల వారీగా సర్వే చేసి యాక్షన్ ప్లాన్కూడా రూపొందించింది. ఆ మేరకు కొందరు రైతులు సాగుకు ముందుకు వచ్చినా సర్కారు మాత్రం విత్తనాలు అందుబాటులో ఉంచలేదు. అడపాదడపా బయట నుంచి విత్తనాలు కొని ఉమ్మడి మెదక్, మహబూబ్‌నగర్‌జిల్లాల్లో కందులు, వేరుశనగ సాగు చేసిన రైతులు..మార్కెటింగ్ఫెసిలిటీ లేక, మద్దతు ధర రాక తీవ్రంగా నష్టపోయారు.
ఈసారి ముందస్తు పంటల సాగు లేనట్లే..
పంట కోత దశలో చెడగొట్టు వానల వల్ల జరుగుతున్న నష్టాన్ని తగ్గించేందుకు ఈ సీజన్ నుంచి ముందస్తు పంటల సాగు చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. కానీ, అందుకు సరైన కార్యాచరణ రెడీ చేయలేదు. వానలు ఆలస్యం కావడంతో ముందస్తు సాగుపై ఎఫెక్ట్ పడింది. రైతులు విత్తనాలు జల్లుకునేందుకు, నార్లు పోసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్టుల నుంచి నీళ్లను విడుదల చేయాల్సిన అధికారులు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అసలు ఇరిగేషన్ఆఫీసర్లతో ఈ విషయమై సర్కారు మీటింగ్ కూడా నిర్వహించలేదంటే నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ముందస్తు పంటలపై సర్కారుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కనీసం రైతులకు కావాల్సిన విత్తనాలైనా అందుబాటులో ఉంచేది. కానీ, కనీసం పచ్చిరొట్ట విత్తనాలు కూడా ముందస్తుగా సప్లై చేయలేకపోయింది. దీంతో ఈ కార్యక్రమం కూడా ఫెయిల్ అయింది. రాష్ట్ర సర్కారు..క్షేత్రస్థాయిలో సమస్యలు పట్టించుకోకుండా, రైతులకు అవగాహన కల్పించకుండా కేవలం ప్రకటనలకే పరిమితం కావడం వల్లే రాష్ట్రంలో వ్యవసాయ సంస్కరణలు ముందరపడడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
2022లో డైరెక్ట్ సీడింగ్వరి..హైడెన్సిటీ కాటన్..
2022లో ‘పెట్టుబడి తగ్గాలే..దిగుబడి పెంచాలే’ అనే కొత్త కాన్సెప్ట్‌ను సర్కార్ తెరపైకి తెచ్చింది. దీనికోసం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు విదేశాలకు వెళ్లి అధ్యయనం చేశారు. ప్రతి క్లస్టర్లో 4 00 ఎకరాల్లో వెదజల్లే (డైరెక్ట్ సీడింగ్) పద్ధతిలో వరి, ప్రతి జిల్లాలో ఐదువేల ఎకరాల్లో హైడెన్సిటీ కాటన్ సాగు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల కూలీల ఖర్చు, విత్తనాలు, ఎరువుల వాడకం తగ్గి రైతులకు పెట్టుబడి ఖర్చులు ఆదా అవుతాయని గొప్పలు చెప్పారు. పత్తి ఎక్కువగా సాగయ్యే జిల్లాల్లో 5 నుంచి 10 వేల ఎకరాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టాలనుకున్న హైడెన్సిటీ ప్లాంటింగ్ఆచరణలో విఫలమైంది. ఈ విధానం వల్ల పత్తి విత్తనాలు తక్కువ పడతాయని, హార్వెస్టింగ్ సిస్టమ్‌లో పత్తిని తీస్తారని ప్రకటించారు. విత్తనాలు సప్లై చేయడానికి నూజివీడు, రాశి కంపెనీలు ముందుకొచ్చాయని సర్కార్పెద్దలు చెప్పినా, ఫీల్డ్లెవెల్లో రైతులకు అవగాహన కల్పించడం, సమీకరించడంతో వ్యవసాయశాఖ ఫెయిలయ్యింది.
సాగు పద్ధతులు మారితే దిగుబడిపై ప్రభావం
వరి పంటలో సాగు పద్ధతులు మారిస్తే అందుకు తగ్గట్టు భూమిని సిద్ధం చేయాలి. వెదజల్లే విధానం, డ్రమ్‌సీడర్ తో నేరుగా దుక్కిలో నాటితే కలుపు పెరిగి దిగుబడిపై ప్రభావం చూపుతుంది. విత్తనం వెదజల్లే, నేరుగా నాటే పద్ధతిలో సాగుకు నీళ్లు సరిపోవు. ఎక్కువ శాతం సాగర్ కెనాల్ కాల్వ పైనే ఆధారపడి వరి వేస్తున్నం. క్వాలిటీ విత్తనాలు, సరైన నీటి వసతి ఉంటే కొత్త పద్ధతిలో వరి సాగుకు అవకాశం ఉంటుంది.
- లింగయ్య, తుంగ పాడు రైతు, మిర్యాలగూడ
పప్పుధాన్యాల సాగుతో ప్రయోజనం తక్కువే
ప్రభుత్వం సన్నాలు సాగు చేయాలని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెప్తున్నా రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించట్లేదు. కందులు, పెసర్లు, ఆముదాలు, జొన్నలు వంటి పంటలు సాగు చేస్తే కనీసం విత్తనాల ఖర్చులు కూడా రావట్లే. ప్రభుత్వం కొత్త రకాల పంటలను సాగు చేయాలని చెప్తున్నా వాటిపై రైతులకు అవగాహన లేదు. ఏ విత్తనం ఎంత మోతాదులో వేయాలి? ఏ పురుగు మందు ఎంత కొట్టాలో తెలియదు. అందుకే ఇంతకుముందు ఏ పంటలైతే సాగు చేసేవాళ్లమో అవే చేస్తున్నాం.
- మల్ రెడ్డి వెంకట్ రెడ్డి, పెద్దగూడెం గ్రామ రైతు, నాగార్జునసాగర్