ఎఫ్ఆర్వో ఫ్యామిలీని పట్టించుకోని ప్రభుత్వం

ఖమ్మం, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫారెస్ట్  రేంజ్  ఆఫీసర్  చలమల శ్రీనివాసరావు హత్య జరిగి మూడు నెలలు కావస్తున్నా, ఆయన ఫ్యామిలీకి పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. మర్డర్  తర్వాత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు కాలేదు. రూ.50 లక్షలు మాత్రమే కుటుంబ సభ్యులకు అందాయి. శ్రీనివాసరావు భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, కంటిన్యూ అవుతుందని చెప్పిన శాలరీ ఇంకా రాలేదు. 500 గజాల ప్లాట్ కూడా ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్  ఆదేశాలతో ఖమ్మం కొత్త బస్టాండ్  సమీపంలోని ఎన్ఎస్పీ క్యాంపులో 500 గజాలు కేటాయించినట్లు పేపర్లను ఫ్యామిలీ మెంబర్స్ కు అందించారు. దాన్ని స్వాధీనం చేసుకొని ప్లాట్ చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్న రెండ్రోజుల్లోనే మున్సిపల్ సిబ్బంది రాత్రికి రాత్రి దాన్ని జేసీబీలతో తొలగించారు. స్థలం వ్యవహారం కోర్టులో ఉందని, వేరే చోట ప్లాట్ చూపిస్తామని కుటుంబ సభ్యులకు రెవెన్యూ సిబ్బంది సమాచారమిచ్చారు. నెల కావస్తున్నా మరొక చోట ప్లాట్ చూపించలేదు. దీంతో పేపర్లపైనే తప్పించి ప్లాట్ మాత్రం బాధితుల చేతికి అందలేదు. 

హామీలిచ్చి మరిచిన్రు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు అటవీప్రాంతంలో గతేడాది నవంబర్ 22న ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు హత్య జరిగింది. ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కావడంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. భార్య భాగ్యలక్ష్మికి ప్రభుత్వ ఉద్యోగం, రూ.50 లక్షల ఆర్థిక సాయం, శ్రీనివాసరావు రిటైర్మెంట్  వరకు యథాతథంగా జీతం, 500 గజాల ఇంటి స్థలం ఇస్తామని ప్రకటించింది. రూ.50 లక్షల చెక్కును మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్  అందజేశారు. కొత్త బస్టాండ్ సమీపంలో సర్వే నెంబర్ 93లో 500 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తూ గతేడాది డిసెంబర్ 29న కలెక్టర్ వీపీ గౌతమ్  ప్రొసీడింగ్స్  ఇచ్చారు. జనవరి 1న ఈ పేపర్లను ఫ్యామిలీ మెంబర్స్ కు అందించారు. ప్లాట్ కు ప్రభుత్వ వ్యాల్యూ ప్రకారం రూ.47.50 లక్షలు చెల్లించాలని కలెక్టర్ సూచించగా, 120 నెలల పాటు శాలరీలో నెలకు రూ.39,585 కట్ అయ్యేలా కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. ఈ ఫిబ్రవరి నుంచి ఈఎంఐ కట్ అవుతాయని ఆర్డర్స్ లో ఉన్నాయి. జనవరి మొదటివారంలో ప్లాట్ ను స్వాధీనం చేసుకున్నట్టుగా 500 గజాల చుట్టూ రూ.2 లక్షలు ఖర్చు చేసి ప్రీకాస్ట్  బిళ్లలతో కాంపౌండ్​వాల్​ ఏర్పాటుచేసుకున్నారు. రెండ్రోజుల తర్వాత తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఆ ప్రహారీని తొలగించడంతో కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. ఆఫీసర్లతో మాట్లాడగా ఈ ప్లాట్  ఎన్ఎస్పీ పరిధిలో ఉందని, కోర్టులో వివాదం ఉన్న కారణంగా మరొక చోట ప్లాట్ చూపిస్తామని సమాధానమిచ్చారు. కానీ ఇంతవరకు చూపించలేదని తెలుస్తోంది. ఇద్దరు పిల్లలు చిన్నవాళ్లు కావడంతో మృతుడి భార్య భాగ్యలక్ష్మికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. జూనియర్  అసిస్టెంట్  ఉద్యోగం కాకుండా సీఎం ప్రత్యేక సూచనల మేరకు డిప్యూటీ తహసీల్దార్  ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆదేశాలు మాత్రం ఇంకా అందలేదు. శ్రీనివాసరావు సర్వీస్  పూర్తయ్యేంత వరకు శాలరీ ఇస్తామని చెప్పినా జీతం అందడం లేదు. అయితే ఫారెస్ట్ ఆఫీసర్లు మాత్రం వాటికి సంబంధించిన ఫైల్  ప్రాసెస్ లో ఉందని, త్వరలోనే బెనిఫిట్స్​ అన్నీ అందుతాయని చెబుతున్నారు. 

ఫైల్ ప్రాసెస్ లో ఉంది

హత్యకు గురైన ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు ఫ్యామిలీ మెంబర్స్ కు ఉద్యోగం, శాలరీకి సంబంధించిన ఫైల్  జీఏడీలో ఉంది. ప్రభుత్వం, అటవీశాఖ మంత్రి ఆ ఫ్యామిలీకి అండగా ఉంటామని ప్రకటించారు. శాలరీకి చెందిన స్పెషల్  ఐడీ క్రియేట్  అయింది. ట్రెజరీకి కూడా వెళ్లింది. వచ్చే నెల నుంచి శాలరీ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం కూడా వీలైనంత త్వరగా వస్తుందని ఆశిస్తున్నాం. మరో ప్లాట్  చూపిస్తామని రెవెన్యూ అధికారులు చెప్పారు. 
‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-నరేందర్, ఫారెస్ట్  రేంజ్ ఆఫీసర్స్  అసోసియేషన్  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి