హైదరాబాద్ లో సిరాజ్‌కు గ్రాండ్ వెల్​కమ్

హైదరాబాద్ లో సిరాజ్‌కు గ్రాండ్ వెల్​కమ్

టీ 20 వరల్డ్ కప్‌ విజయం తర్వాత శుక్రవారం హైదరాబాద్‌ చేరుకున్న టీమిండియా క్రికెటర్ సిరాజ్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. మెహిదీపట్నంలో భారీ రోడ్‌షోలో సిరాజ్​ పాల్గొన్నాడు. సన్ రూఫ్‌ కారులో నిల్చొని త్రివర్ణ పతాకాన్ని చేతిలో పట్టుకుని అభిమానులను ఉత్సాహపరిచాడు.

హైదరాబాద్, వెలుగు: జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పోరాటం ఆపొద్దని టీ20 వరల్డ్ కప్‌‌ విన్నింగ్ టీమ్ మెంబర్ హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ యువతకు సూచించాడు. స్వీయ నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చని అన్నాడు.  13 ఏండ్ల తర్వాత ఇండియా వరల్డ్ కప్‌‌ సాధించడం, అందులో తాను భాగమైనందుకు చాలా ఆనందంగా ఉందని, వరల్డ్ చాంపియన్‌‌ అన్న ఫీలింగ్‌‌ను వర్ణించడానికి మాటలు రావడం లేదని చెప్పాడు.  ఈ విజయం తనతో పాటు  హైదరాబాద్‌‌ గర్వించే సందర్భమన్నాడు.  వరల్డ్ కప్‌‌ నెగ్గి తొలిసారి హైదరాబాద్‌‌కు వచ్చిన సిరాజ్‌‌కు శుక్రవారం సిటీలో అభిమానులు ఘన స్వాగతం పలికారు.  

మెహిదీపట్నం  సరోజిని దేవి కంటి ఆస్పతి నుంచి ఈద్గా  గ్రౌండ్ వరకూ జరిగిన రోడ్‌‌షోలో పాల్గొన్నాడు. సన్ రూఫ్‌‌ కారులో నిల్చొని త్రివర్ణ పతాకాన్ని చేతిలో పట్టుకొని ముందుకు సాగాడు. అభిమానులతో కలిసి ‘లెహెరాదో’ పాట పాడుతూ ఉద్వేగానికి గురయ్యాడు. తాను చిన్నతనం నుంచి ప్రాక్టీస్ చేసిన ఈద్గా గ్రౌండ్‌‌ చేరి  ఫ్యాన్స్‌‌ను ఉద్దేశించి మాట్లాడాడు. ‘ఇది నా హోమ్ గ్రౌండ్‌‌. చిన్నప్పటి నుంచి ఇక్కడే  ప్రాక్టీస్ చేస్తూ ఈ స్థాయికి వచ్చా. నా కష్టం, సుఖం అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక్కడినే కాదు మీరందరూ చాంపియన్లే. ఇండియాలో క్రికెట్ అడే ప్రతీ పిల్లాడు చాంపియనే.  

మీరు (యువత) కూడా జీవితంలో ఎన్ని అవాంతరాలు, కష్టాలు ఎదురైనా  పోరాటాన్ని మాత్రం ఆపొద్దు. మనో ధైర్యాన్ని కోల్పోవద్దు. ఈ రోజు కాకపోతే రేపైనా విజయం మిమ్మల్ని  వరిస్తుంది. మన చుట్టూ ఉన్న వాళ్లు నువ్వు ఇది చేయలేవు... అది చేయలేవు అని అంటుంటారు. కానీ, నీపై నీకు నమ్మకం ఉంటే నువ్వు ఏదైనా సాధిస్తావని గుర్తుంచుకో’ అని సూచించాడు.  అనంతరం ఫ్యాన్స్‌‌తో ఇండియా.. ఇండియా అంటూ నినాదాలు చేయించాడు. అంతకుముందు ఎయిర్‌‌‌‌పోర్టులో అభిమానులు, హెచ్‌‌సీఏ ప్రతినిధులు అతనికి ఘన స్వాగతం పలికారు.