- రూల్స్పాటించని 54 ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీసులు
- నోటీసులిచ్చి ఆరు నెలలైనా స్పందించని ఆస్పత్రులు
- నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యారోగ్యశాఖ అధికారులు
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో విచ్చల విడిగా సిజేరియన్లు చేసే ఆస్పత్రులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ వినిపిస్తోంది. ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో నామ్‌కే వాస్తే గా తనిఖీలు చేసి, నోటీసులిచ్చి వైద్యారోగ్య శాఖ చేతులు దులుపుకుందని విమర్శలు వస్తున్నాయి. చాలా ఆస్పత్రులలో గర్భిణులకు సాధారణ ప్రసవాలు చేయాల్సి ఉండగా పైసల కక్కుర్తితో సిజేరియన్లు చేస్తున్నా.. వైద్యారోగ్య శాఖ ఆరోగ్యశాఖ అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.జిల్లాలో సుమారు 155 వరకు ప్రైవేట్గైనిక్ఆస్పత్రులు ఉన్నాయి. ఈ హాస్పిటల్స్ లో ప్రసవాల కోసం చేరుతున్న గర్భిణుల్లో 95 శాతం మందికి సిజేరియన్లు చేయడం పరిపాటిగా మారింది. అధికారుల లెక్కల ప్రకారం.. జిల్లాలోని ప్రైవేట్ఆస్పత్రులలో రోజూ సుమారు 300 మంది గర్భిణులు ప్రసవాల కోసం జాయిన్అవుతున్నారు. ఇందులో 285 మంది గర్భిణులకు సిజేరియన్లు జరుగుతున్నాయి. డెలివరీ ఛార్జీల కింద హాస్పిటల్ స్థాయి లెక్కన రూ. 15 వేల నుంచి 25 వేలు ఛార్జీ వేస్తున్నారు. అనస్థీషియా డాక్టర్ ఛార్జీలు అదనంగా వసూలు చేస్తున్నారు. బిడ్డ ఆరోగ్య పరిస్థితి బాగా లేకుంటే ఇంక్యూబేటర్లో ఉంచి వాటి ఛార్జీలను అదనంగా తీసుకుంటున్నారు. అయితే చాలామంది నార్మల్ డెలివరీ అయ్యే అవకాశా లున్నా పైసల కక్కుర్తితో ఆపరేషన్లు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
నామ్‌కే వాస్తే.. నోటీసులా..
రూల్స్పాటించకుండా సిజేరియన్లు చేస్తున్నారని జిల్లాలోని 54 ప్రైవేట్హాస్పిటల్స్ కు వైద్యారోగ్య శాఖ అధికారులు నోటీసులిచ్చారు. కలెక్టర్ ఆదేశాలతో గతేడాది జూన్ 28 నుంచి జులై 7 వరకు ప్రైవేట్ హాస్పిటల్స్ లో సిజేరియన్లపై విచారణ చేపట్టారు. 8 తనిఖీ బృందాలు రంగంలోకి దిగాయి. ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున ఆఫీసర్లతో నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ లోని గైనకాలజీ ఆస్పత్రుల్లో తనిఖీలు చేశారు. తనిఖీల్లో భాగంగా అనేక ఆస్ప త్రుల్లో సరిపోను వైద్యులు, లేబర్ రూంలు, బయో మెడికల్ వేస్టేజ్, సిబ్బంది, సౌలత్లు, పరికరాలు లేనట్లు గుర్తించారు. రిపోర్టు రెడీ చేసి కలెక్టర్ , డీఎంహెచ్ వో లకు అందించారు. జిల్లా కేంద్రంలో 37, బోధన్ 8, ఆర్మూర్ 9 ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చారు. 5 రోజుల్లో నోటీసులకు వివరణ ఇవ్వాల్సి ఉంది. 6 నెలలు గడుస్తున్నా.. వివరణ ఇవ్వడం లేదు. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ వారు అధికారపార్టీ లీడర్లు ఎమ్మెల్యే తో లాబీ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో వైద్యారోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది.
సిజేరియన్లతో దోపిడీ చేస్తున్రు
అవసరం లేకున్నా సిజేరియన్లతో దోపిడీ చేస్తున్రు. నోటీసులు ఇచ్చిన ప్రైవేట్ హాస్పిటల్స్‌పై చర్యల్లేవు. చాలా హాస్పిటల్స్‌లో సీరియస్ అంటూ భయపెట్టి సిజేరియన్లు చేస్తున్రు. రూ.25 వేలకు పైగానే చార్జీలు వసూలు చేస్తున్రు. నోటీసులిచ్చి 6 నెలలు అవుతున్నా స్పందించడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి.
- పంచారెడ్డి ప్రవళిక, మహిళా మోర్చా జిల్లా ప్రెసిడెంట్
చర్యలు తప్పవు
సిజేరియన్లపై రూల్స్అతిక్రమించిన హాస్పిటల్స్‌పై చర్యలు చేపడుతాం. సిజేరియన్ల రూల్స్ ఉల్లంఘన నోటీసులిచ్చాం. తనిఖీల రిపోర్ట్ఆధారంగా జిల్లాలో 54 హాస్పిటల్స్‌కి నోటీసులు పంపాం. ఉన్నతాధికారుల ఆదేశాలతో చర్యలుంటాయి.
- డాక్టర్ సుదర్శనం, డీఎంహెచ్వో