విజయకు చేయూత.. నష్టాల్లో ఉన్న డెయిరీకి సర్కార్‌‌ అండ

  • గురుకులాలు, హాస్టళ్లు, అంగన్‌‌వాడీల్లో విజయ పాలే వాడాలని ఆర్డర్స్‌‌
  • ఆలయాలకు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్‌‌ కూడా విజయ డెయిరీకే..
  • పాడి రైతులకు పెండింగ్‌‌ ఉన్న రూ. 100 కోట్లు ఇస్తామని హామీ
  • మొదటి విడతలో రూ. 50 కోట్లు విడుదల

నల్గొండ, వెలుగు :  ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలో నడిచే విజయ డెయిరీని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ సంస్థలు, ఆలయాల్లో విజయ పాల ఉత్పత్తులనే వాడాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు రైతులకు చెల్లించాల్సిన బకాయిలను సైతం విడుదల చేసింది. 

రూ.50 కోట్ల బకాయిలు చెల్లింపు

విజయ డెయిరీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజు 1.60 లక్షల మంది పాడి రైతుల నుంచి 4.07 లక్షల లీటర్లను సేకరిస్తున్నారు. ఇందుకు లీటర్‌‌ పాలకు రూ. 40 చొప్పున రైతులకు చెల్లిస్తున్నారు. ఇలా ప్రతి రోజు రూ. 1.50 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకు బిల్లు అవుతుండగా, ప్రతి 15 రోజులకు ఒకసారి రైతులకు డబ్బులు అందజేయాలి. కానీ పాల సేకరణకు తగ్గట్లు సేల్స్‌‌ లేకపోవడంతో నిల్వలు భారీగా పేరుకుపోయి సంస్థ నష్టాల బాట పట్టింది. మరో వైపు గత సర్కార్‌‌ విజయ డెయిరీని పట్టించుకోకపోవడంతో రైతులకు కనీసం బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది.

Also Read :- కోతుల కంట్రోల్ ఎట్ల?

దీంతో రైతులకు రూ. 100 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌‌లో పడ్డాయి. ఈ నేపథ్యంలో విజయ డెయిరీని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు కాంగ్రెస్‌‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మొదటగా రైతులకు చెల్లించాల్సిన రూ. 100 కోట్ల బకాయిలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో పాటు, మొదటి విడత కింద రూ. 50 కోట్లను విడుదల చేసింది. దీంతో పాటు అన్నీ ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ విజయ ఉత్పత్తులనే వాడాలని ఆదేశాలు జారీ చేసింది.

హాస్టళ్లు, అంగన్‌‌వాడీలకు విజయ పాలే...

విజయ డెయిరీ ప్రతి రోజు 4.07 లక్షల లీటర్ల పాలను సేకరిస్తుండగా.. ఇందులో 47 వేల లీటర్లను గురుకులాలకు, మరో 50 వేల లీటర్లను హాస్టళ్లకు సరఫరా చేస్తున్నారు. అంగన్‌‌వాడీ కేంద్రాలకు గతంలో కర్ణాటక నుంచి పాలను సరఫరా చేసేవారు. కానీ ఇటీవల విజయ డెయిరీ పాలనే వాడాలని ప్రభుత్వం అదేశించడంతో ప్రస్తుతం రోజుకు 50 వేల లీటర్ల చొప్పున పంపిస్తున్నారు. వీటితో పాటు అంగన్‌‌వాడీల్లో అందించే బాలామృతానికి సైతం ఈ డెయిరీ నుంచే పాలు సరఫరా 
అవుతున్నాయి. 

ఆలయాల్లో ‘విజయ’ నెయ్యి వాడాలని ఆర్డర్స్‌‌

రాష్ట్రంలోని కొన్ని ప్రధాన ఆలయాల్లో వాడే నెయ్యిని విజయ డెయిరీ నుంచి కాకుండా ప్రైవేట్‌‌ సంస్థల నుంచి తీసుకుంటున్నారు. తెలంగాణలో ఏటా కోటి రూపాయలకు పైగా ఆదాయం వచ్చే ఆలయాలు 12 ఉండగా, రూ. 50 లక్షల నుంచి రూ.కోటి వచ్చేవి 24, రూ. 25 లక్షల నుంచి రూ.50 లక్షల ఆదాయం వచ్చేవి 325 ఉన్నాయి. పెద్ద ఆలయాల్లో నెయ్యి కొనుగోలుకు టెండర్లు పిలుస్తుండగా.. చిన్నవాటిలో మాత్రం ఆఫీసర్లే నేరుగా కొనుగోలు చేస్తున్నారు. అయితే ప్రైవేట్‌‌ కంపెనీలు సరఫరా చేసే నెయ్యిలో క్వాలిటీ ఉండడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో వాడే నెయ్యిని విజయ డెయిరీ నుంచే కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో యాదగిరిగుట్ట మినహా మిగిలిన అన్ని ఆలయాలకు విజయ డెయిరీనే నెయ్యి సరఫరా చేస్తోంది. యాదగిరిగుట్టలో సైతం త్వరలో విజయ డెయిరీ నెయ్యినే వాడేలా చర్యలు చేపట్టారు.

ప్రక్షాళన దిశగా అడుగులు

కొందరు ప్రైవేట్‌‌ వ్యక్తులు ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు పాలను సేకరించి ‘విజయ’ బ్రాండ్‌‌ పేరుతో మార్కెట్‌‌లో అమ్ముతున్నారు. దీంతో పాటు విజయ డెయిరీకి మార్కెట్‌‌ సరిగా లేకపోవడంతో నష్టాల బాట పట్టింది. మరో వైపు టెట్రా ప్యాకింగ్‌‌ సౌకర్యం లేకపోవడంతో అంగన్‌‌వాడీలకు పాలను సరఫరా చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యలను అధిగమించేందుకు చర్యలు చేపట్టారు. మార్కెటింగ్‌‌ సౌకర్యం పెంచుకోవడంతో పాటు త్వరలోనే టెట్రా ప్యాకింగ్‌‌ సౌకర్యాన్ని సైతం అందుబాటులోకి తేనుంది. వీటితో పాటు మాప్‌‌ టెక్నాలజీని ఉపయోగించి దూద్‌‌పేడ నిల్వ సామర్థ్యాన్ని సైతం పెంచేలా ప్లాన్‌‌ చేస్తున్నారు.