గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి.. సీపీఆర్ చేసినా దక్కని ప్రాణం

కరీంనగర్ జిల్లాలో ఓ హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతిచెందారు. శంకరపట్నం మండలం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ పరంధాములు గుండెపోటుతో చనిపోయారు. ఆయనకు సీపీఆర్ చేసినా ప్రాణం మాత్రం దక్కలేదు. హుజురాబాద్ జైలు నుంచి రిమాండ్ ఖైదీలను కోర్టులో హాజరు పరిచి..తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు పరంధాములు. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది, స్థానికులు ఆస్పత్రికి తరలించి.. సీపీఆర్ చేసినా ప్రాణం దక్కలేదు.

పరంధాములు మృతి పట్ల సీపీ సుబ్బారాయుడు సంతాపం ప్రకటించారు. పరంధాములు మృతిపట్ల తోటి సిబ్బంది షాక్ క్ గురయ్యారు. అప్పటి వరకూ తమతో కలిసి విధులు నిర్వర్తించిన పరంధాములు ఇలా గుండెపోటుతో చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఆయన కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. 

ఈ మధ్యకాలంలో గుండెపోటు మరణాలు బాగా పెరిగిపోయాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న పిల్లలు మొదులుకొని పెద్ద వయస్సు కలిగిన వారు గుండెపోటుతో మరణిస్తున్నారు. ఇప్పుడు అందరినీ కార్డియాక్ అరెస్టులు వణికిస్తున్నాయి. అప్పటివరకు బాగున్న మనుషులు ఎక్కడ చూసినా క్షణాల్లో కుప్పకూలడం, ఆపై ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో కంటే చాలా ఎక్కువగా, సడన్ గా వస్తున్న గుండెపోటులపై ప్రతి ఒక్కరిలోనూ భయాందోళన కలుగుతోంది.