ఈ ఏనుగు బాధ చూస్తే కంటతడి పెట్టనివారుండరేమో!

బురద గుంటలో చిక్కుకున్న గజరాజు

అపాయాన్ని లెక్క చేయకుండా కాపాడిన స్థానిక ప్రజలు

సుందర్ గఢ్: ఎదుటి వారి బాధ మన గుండెల్ని తాకితే.. వారి కష్టం చూసి మన కళ్లు చమర్చితే.. మనకు ఎదురయ్యే అపాయాన్ని కూడా లెక్క చేయకుండా సాయం చేసే ధైర్యం వస్తుందేమో!

ఒడిశాలో జరిగిన ఈ సంఘటన చూస్తే ఇది నిజమేనని అనిపించకమానదు. సుందర్ గఢ్ ప్రాంతంలో ఓ ఏనుగు బురద గుంటలో చిక్కుకుని బయటకు రాలేక ఆపసోపాలు పడుతోంది. మామూలుగా అయితే దాని ఘీంకారానికే భయపడే వాళ్లు.. ఆపదలో గజరాజు అల్లాడిపోవడం చూసి.. సాయం చేయడానికి తెగింపు చూపారు. తాళ్లు, పెద్ద పెద్ద కొయ్యలతో బయటకు తీశారు. అటవీ అధికారులతో కలిసి దాదాపు రోజులో సగం టైం దాన్ని కాపాడడానికే సరిపోయింది వారికి. మొత్తానికి వారి రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయింది. గుంటలో నుంచి బయటపడిన ఏనుగు పరుగు పెట్టి అడవిలోకి వెళ్లిపోయింది.

తెగువ భేష్..

ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కశ్వాన్ ఈ రెస్క్యూ ఆపరేషన్ వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన వారు స్థానికుల్ని అభినందిస్తున్నారు. తరచూ తమ ఊరిపై పడి నానా రభస చేసి, ఆస్తి, ప్రాణ నష్టం కలిగించే ఏనుగును కాపాడడానికి వారి తెగువ భేష్ అంటూ కామెంట్లు చేశారు. మానవత్వం మిగిలే ఉందనడానికి నిదర్శనం అని కొందరు ట్వీట్ చేశారు.