![మూడ్‌ని మార్చే ఇల్లు](https://static.v6velugu.com/uploads/2020/12/house-1.jpg)
చక్కని ఇల్లు ఓ స్వర్గం. ఇల్లు ఉండేదాని బట్టే ఇంట్లో వాళ్ల మూడ్ ఆధారపడి ఉంటుంది.శుభ్రంగా ఉండే ఇల్లు మంచి మూడ్‌ని తెచ్చిపెడుతుంది. అందంగా కనిపించి ఉత్సాహాన్ని నింపుతుంది. అందుకే ఇంటికి రాగానే ఇల్లు అందంగా, శుభ్రంగా ఉండాలని చాలామంది కోరుకుంటారు. కానీ వింటర్ సీజన్‌లో ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నా ఒకలాంటి తేమ, చెమ్మ, వాసన వస్తుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సీజన్ లో కూడా ఇంటిని ఎంతో శుభ్రంగా, అందంగా ఉంచుకోవచ్చు.
కలర్స్
మూడ్స్‌ను ఛేంజ్ చేసే వాటిలో కలర్స్ ఒకటి. అందుకే ఇంట్లో పెట్టే వస్తువుల రంగులు నచ్చినవే ఉండాలి. లేదంటే దాని ప్రభావం తెలియకుండానే మూడ్‌పై పడుతుంది. అందులోనూ చలికాలంలో ఎక్కువ మూడీగా ఉంటుంది. అందుకే ఆ ఫీలింగ్ పోవాలంటే ఇల్లంతా డార్క్ కలర్స్‌తో నింపాలి. సోఫా పిల్లోస్‌కి రంగు రంగుల కవర్స్ వేయాలి. ఫ్లవర్ వేజుల్లో డార్క్ కలర్ ఫ్లవర్స్ పెట్టాలి. ఫ్లోర్ మ్యాట్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్‌తో ఉన్నవి సెలెక్ట్ చేస్తే ఇల్లు అందంగా కనిపిస్తుంది.
కర్టెన్స్
ఇంటిని అందంగా మార్చడంలో కర్టెన్స్ పాత్ర చాలా ఉంటుంది. రంగు రంగుల కర్టెన్స్ ఇంటికి కొత్త కళను తెస్తాయి. డోర్ మ్యాట్స్, సోఫా, దివాన్ సెట్, గోడలకు మ్యాచ్ అయ్యేటట్టు లేదా కాంట్రాస్ట్ కలర్స్ కర్టెన్స్ వేయాలి. దీనివల్ల ఇల్లు అందంగా కనిపిస్తుంది. కలర్స్ కూడా బాగా లైట్‌వి కాకుండా డార్క్ కలర్స్ ఎంచుకుంటే బాగుంటుంది. ఒకవేళ లైట్ కలర్‌లో కావాలనుకుంటే లైట్ గ్రీన్, పెద్ద పెద్ద ఫ్లవర్స్‌తో ఉన్న కర్టెన్స్ వేసుకుంటే మంచి ఫీల్ వస్తుంది. ఈ సీజన్‌లో దళసరి కర్టెన్స్ వేయడం వల్ల ఇల్లు వెచ్చగా ఉంటుంది.
బెడ్ రూమ్స్
ఈ సీజన్‌లో బెడ్రూంలు పచ్చదనంతో నింపితే చూడగానే అందంగా కనిపిస్తాయి. ఆకులు పువ్వులతో ఉన్న గ్రీన్ కలర్ బెడ్ షీట్లు వేసినా రూమ్ కూల్‌గా కనిపిస్తుంది. కర్టెన్స్, బెడ్ షీట్‌తో పాటే బెడ్‌పై దానికి మ్యాచింగ్ లేదా కాంట్రాస్ట్ కలర్‌లో పెద్దపెద్ద బ్లాంకెట్స్, క్విల్ట్స్ వేయాలి. రూమ్ కార్నర్స్‌లో ఫ్రెష్ ఫ్లవర్స్ వాజ్ పెడితే ఆ వాసన రూమ్ అంతా నిండిపోతుంది.
క్యాండిల్స్
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇంట్లో క్యాండిల్స్ పెడితే మంచి మూడ్ క్రియేట్ అవుతుంది.
క్యాండిల్ లైట్ డిన్నర్ చేయడం కూడా చాలా రొమాంటిక్‌గా…హ్యాపీగా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు క్యాండిల్స్.. సాంబ్రాణి, తాజా పూలు వంటి ఎన్నో మంచి ఫ్లేవర్స్‌లో దొరుకుతున్నాయి. వీటిని బెడ్ రూమ్‌లో పెట్టడం వల్ల కూడా మంచి స్మెల్ వస్తుంది.
ప్లాంట్స్
సరైన మొక్కలు పెంచుకోవడానికి కూడా ఇదే మంచి సీజన్. ఇండోర్ ప్లాంట్స్‌ను తెచ్చుకుని బెడ్రూం విండో దగ్గర, లివింగ్ రూమ్‌లో సోఫా పక్కన పెట్టాలి. ఇలా చేస్తే పచ్చదనమే ఇంట్లోకి నడిచి వచ్చినట్లు ఉంటుంది.
విండ్ చైమ్స్
ఇంట్లో ఎన్ని మార్పులు చేసినా ఇంకా మంచి మూడ్ కావాలనుకుంటే ఇంకో చిన్న పని చేయొచ్చు. అవే విండ్ చైమ్స్. వీటిని కిటికీ దగ్గర హ్యాంగ్ చేయాలి.అలా చేస్తే గాలి వీస్తున్నప్పుడు అవి కదిలి చక్కని మ్యూజిక్‌ని ఇస్తాయి.
ఎంట్రన్స్ డోర్
ఇంటి లోపల ఎంత శ్రద్ధ పెడతామో ఇంట్లో ఎంటరయ్యే ఎంట్రన్స్ డోర్ దగ్గర కూడా అంతే శ్రద్ధ పెట్టాలి. డోర్ ఎట్రాక్టివ్‌గా కనిపించాలంటే వాటికి డార్క్ కలర్ పెయింటింగ్ వేయాలి. మంచి కొటేషన్ ప్లేట్ తగిలించొచ్చు. ఏదీ వద్దనుకుంటే ఇంటి నెంబర్ లేదా పేరును క్రియేటివ్‌గా రాసుకోవచ్చు. ఇంకా వాకిలి అందంగా కనిపించాలంటే పూల కుండీలు పెట్టుకోవాలి. ఓ క్రీపర్ గోడకు ఎక్కించినా బాగుంటుంది.
ఇలా చేయొచ్చు
రెగ్యులర్‌గా వాడే వస్తువులను మాత్రమే ఇంట్లో ఉంచాలి. అక్కర్లేని వాటిని ప్యాక్ చేసి ఎక్కడైనా పెట్టాలి. ఇలా చేస్తే ఇల్లు ఫ్రీగా ఉంటుంది. ఇంటిని క్రమం తప్పకుండా క్లీన్ చేయాలి. వారానికి ఒకసారి బెడ్ షీట్స్, టవల్స్ మార్చాలి. లేదంటే తేమ, చల్లదనం వల్ల చెడు వాసన వస్తుంది.
నెలకొకసారైనా కర్టెన్స్ మార్చాలి.
ఇంటిలోపల మొక్కలు పెట్టేటప్పుడు దోమలు పెరగకుండా చూసుకోవాలి. అందుకే మరీ ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్ పెట్టకుండా అక్కడక్కడ అందంగా అమర్చుకుంటే బాగుంటుంది. గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా సోడా, ఉప్పు వేసి ఆ నీళ్లతో ఫ్లోర్ తుడిస్తే జిడ్డు, మరకలు పోవడమే కాదు..దోమలు, ఈగలు, బ్యాక్టీరియా వంటివి రావు. రోజూ సాయంత్రం పూట ఇంట్లో ఏదైనా ఒక మూల కర్పూరం వెలిగిస్తే ఇల్లంతా మంచి వాసన వస్తుంది. దోమలు కూడా తగ్గుతాయి. వంటగది ప్రతీ రోజూ శుభ్రం చేయాలి. ఇలా చేస్తుంటే చిన్న చిన్న పురుగులు, క్రిములు దరి చేరవు. అప్పుడప్పుడు మంచి ఫ్లేవర్స్ ఉన్న అగరబత్తీలు వెలిగించడం వల్ల కిచెన్ మంచి వాసనతో నిండిపోతుంది.