నాగార్జున సాగర్ దగ్గర నిర్మిస్తున్న సుంకిశాల పంప్ హౌజ్ లో భారీ ప్రమాదం జరిగింది. సొరంగంలోని నీరు రాకుండా నిర్మించిన రిటెయినింగ్ వాల్ కుప్పకూలింది. ప్రమాద సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చడం కోసం నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి కృష్ణజలాలను తరలించేందుకు నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సమీపంలో సుంకిశాల పంప్ హౌజ్ నిర్మాణం చేపట్టారు. ఇందులో సొరంగంలోకి సాగర్ జలాలు రాకుండా రక్షణ కోసం రిటెయినింగ్ వాల్ నిర్మించారు.
ఇటీవల నాగార్జున సాగర్ కు భారీ వరద వచ్చి చేరడంతో రక్షణ గోడ ఒత్తిడికి గురై ఒక్కసారిగా కుప్పకూలింది. దీనికి సంబందించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పంప్ హౌజ్ నిర్మాణంలో షిఫ్ట్ కు వందమందికి పైగా మూడు షిఫ్ట్ లలో కార్మికులు పని చేస్తుంటారు. ఘటన జరిగిన సమయంలో కూలీలు షిఫ్ట్ మారడానికి వెళ్లడంతో ఘోర ప్రమాదం తప్పింది. నిర్మాణ సంస్థ అవగాహాన లోపం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పలు ఆరోపణలు వస్తున్నాయి.