రంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. హైదరాబాద్ మీదుగా బెంగుళూరు తరలిస్తున్న 60 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతోన్న ఇద్దరు స్లగ్మర్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వివరాల ప్రకారం.. ఆంధ్ర నుండి హైదరాబాద్ మీదుగా బెంగుళూరుకు కారులో గంజాయి తరలిస్తున్నట్లు మహేశ్వరం మండలం స్పెషల్ ఆపరేషన్ టీమ్, యాచారం పోలీసులకు సమాచారం అందించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు రంగారెడ్డి జిల్లాలోని యాచారం చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే గంజాయి తరలిస్తున్న కారును అడ్డుకుని ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల నుండి 25 లక్షల విలువైన సామాగ్రితో పాటు రెండు మొబైల్ ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న వ్యక్తులను ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కొర్రబాబురావు (25), బురుండి కామేశ్వర్‌రావు (33)గా పోలీసులు గుర్తించారు. కొర్రబాబురావు, కామేశ్వర్‌రావులు షేక్ మస్తాన్ వలీ, దుడ్డు మల్లేశ్వర్ రావు అనే మరో ఇద్దరు వ్యక్తులతో చేతులు కలిపి నర్సీపట్నంలో 60 కిలోల గంజాయి కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ గంజాయిని హైదరాబాద్ మీదుగా బెంగళూరు తరలిస్తుండగా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి ముఠాలోని మరో నలుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారని.. వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.