బ్యాగ్లో రూ.22 లక్షలు.. లెక్కాపత్రం లేదు.. యాక్టివాపై తీసుకెళ్తూ దొరికిపోయారు..!

బ్యాగ్లో రూ.22 లక్షలు.. లెక్కాపత్రం లేదు.. యాక్టివాపై తీసుకెళ్తూ దొరికిపోయారు..!

బషీర్ బాగ్, వెలుగు: కోఠిలోని గుజరాత్ గల్లీలో భారీగా హవాలా డబ్బు పట్టుపడింది. సుల్తాన్ బజార్ సీఐ శ్రీనివాస చారి తెలిపిన వివరాల ప్రకారం.. హవాలా నగదు తరలిస్తున్నారన్న విశ్వసనీయమైన సమాచారంతో కోఠిలోని గుజరాత్ గల్లీలో పోలీసులు బుధవారం తనిఖీలు చేపట్టారు. సాయంత్రం 5 గంటల సమయంలో మొఘల్ పురా ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ ఖయుమ్, సుల్తాన్ బజార్ కు చెందిన ఉత్తమ్ కుమార్, లలిత్ సింగ్ ముగ్గురు వ్యాపారులు కలిసి అనుమానాస్పదంగా ఓ బ్యాగ్ ను యాక్టివాపై తీసుకెళ్తుండగా వారిని తనిఖీ చేశారు. బ్యాగ్ లోని రూ.22 లక్షలకు ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశారు. నగదుతో పాటు యాక్టివా వాహనం , రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నగదును ఇన్​కమ్ టాక్స్  అధికారులు అప్పగించారు.