- ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు
- ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బోర్సి గ్రామంలో ఘటన
భద్రాచలం, వెలుగు : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బెమేతెరా జిల్లా బేర్లా బ్లాక్‌లోని బోర్సీ గ్రామంలో ఉన్న గన్ పౌడర్ ఫ్యాక్టరీలో శనివారం భారీ పేలుడు జరిగింది. ప్రమాదంలో ఒకరు చనిపోగా, ఆరుగురికి గాయాలు అయ్యాయి. శనివారం ఉదయం 7.45 గంటలకు ఫ్యాక్టరీలో రాం, రఘువంశీ, దిలీప్ ధృవ్, నీరజ్ యాదవ్, చందన్‌కుమార్, మనోహర్ యాదవ్, రవికుమార్ పనిచేస్తున్నారు. ఈ టైంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు జరగడంతో శకలాలు కార్మికుల కాళ్లు, చేతులు, తలకు తగిలి తీవ్రంగా గాయపడ్డారు.
రాం అనే కార్మికుడు స్పాట్‌లోనే చనిపోయాడు. గాయపడిన వారిని డాక్టర్ భీంరావు అంబేద్కర్ హాస్పిటల్‌కు తరలించి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. దిలీప్ ధృవ్, చందన్ కుమార్ ఆరోగ్యం మెరుగుపడడంతో వారిని డిశ్చార్జ్ చేశారు. సమాచారం అందుకున్న కలెక్టర్, ఎస్పీ, రెస్క్యూ టీంలు వెంటనే రంగంలోకి దిగాయి. ప్రమాదంపై విచారణకు ఛత్తీస్‌గఢ్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.