చెన్నై : డీఎంకే యువజన విభాగం నేత, ఎమ్మెల్యే ఉదయ నిధి స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఉదయ నిధి గెలుపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తి భారతీ దాసన్ బెంచ్ తోసి పుచ్చింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెపాక్ – తిరువల్లికేని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఉదయ నిధి స్టాలిన్ విజయం సాధించారు.
ఉదయ నిధి గెలుపును వ్యతిరేకిస్తూ దేశీయ మక్కల్ కట్చి నేత ఎంఎల్ రవి కోర్టుకెళ్లారు. అయితే.. ఆరోపణలకు సంబంధించి.. ఎలాంటి ఆధారాలు సమర్పించకపోవడంతో మొదట్లోనే పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత చెపాక్ – తిరువల్లికేని అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఓటరు ప్రేమలత పిటిషన్ వేశారు. తన మీదున్న కేసుల వివరాల్ని నామినేషన్‌లో ఉదయ నిధి చూపించలేదని, నామినేషన్ పత్రాలలోనూ అనేక అనుమానాలు ఉన్నట్టు కోర్టు దృష్టికి తెచ్చారు. ఉదయ నిధి గెలుపు రద్దు చేయాలని కోరారు.
న్యాయమూర్తి భారతీ దాసన్ బెంచ్‌లో ఈ పిటిషన్లు విచారణకు వచ్చింది. ఉదయ నిధి తరపున సీనియర్ న్యాయవాది ఎన్‌ఆర్ ఇళంగో వాదనల్ని వినిపించారు. అయితే, పిటిషనర్ ప్రేమలత తన ఆరోపణలకు తగిన ఆధారాల్ని కోర్టులో సమర్పించలేదు. దీంతో ఉదయ నిధికి ఊరట కల్గిస్తూ, ఆయన గెలుపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ విచారణార్హం కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వారసుడిగా, ఆ పార్టీ యువజన ప్రధాన కార్యదర్శిగా ఉదయ నిధి చక్రం తిప్పుతున్నారు.
మరిన్ని వార్తల కోసం..