యూపీలోని లక్నోలో భారీ బిల్డింగ్ కుప్పకూలింది. వజీర్ హసంగంజ్ రోడ్లో నాలుగు అంతస్తుల భవనం నేలమట్టం అయింది. ఈ భవనం శిథిలాల కింద దాదాపు 60 మంది దాకా చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూడు మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి.
భవనం కుప్పకూలినట్లు సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు. ఇప్పటి వరకు ఏడుగురిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. భవనంలో దాదాపు 35 కుటుంబాల వరకు నివాసం ఉంటున్నాయని యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ తెలిపారు.
మంగళవారం ఉత్తరాఖండ్ కేంద్రంగా ఢిల్లీ, ఎన్సీఆర్ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది. ఈ తరుణంలో భవనం భూకంపం వల్లనే కుప్పకూలిందా లేక..బలహీనంగా ఉండి కుప్పకూలిందా అన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.