రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ పరిధిలోని కిస్మత్ పూర్ లో వాసులకు పెను ప్రమాదం తప్పింది. మంగళవారం జూలై 30, 2024న సాయంత్రం ఓ ఇంటిపై భారీ క్రేన్ విరిగిపడింది. ఇంటి డాబాపై చంటి బిడ్డతో వాకింగ్ చేస్తున్న వివాహితకు సమీపంలో ఈ క్రేన్ కూలింది. వివాహిత పక్కన క్రేన్ కూలడంతో పెద్ద ప్రమాదం తప్పింది.. భారీ క్రేన్ కూలుతున్న సమయంలో వచ్చిన పెద్ద శబ్ధంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. వెంటనే వివాహిత ఇంటిపైకి చేరుకున్న కాలనీ వాసులు.. క్రేన్ ఆమెపై పడివుంటే పరిస్థితి ఏంటని ... జనావాసాల మధ్య ఈ భారీ క్రేన్లు ఏర్పాటుపై మండిపడ్డారు.
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓం నగర్ కాలనీలో ఓ బహుళ అంతస్తుల భవనం నిర్మాణంలో ఉంది. 24 గంటలు నిర్విరామంగా బహుళ అంతస్తుల భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. నిర్మాణం కోసం భారీ క్రేన్ ను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఇండ్ల మధ్య ఇలాంటి భారీ క్రేన్లు ఏర్పాటు చేసినప్పుడు నిర్లక్ష్యంగా ఉండటంపై భవన యాజమాన్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనతో కోపోద్రోక్తులైన కాలనీ వాసులు కంస్ట్రక్షన్ ఇంచార్జ్ పై దాడికి యత్నించారు. వెంటనే నిర్మాణ పనులు ఆపాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసు కున్న పోలీసులు ఘటనస్థలానికి వచ్చి కాలనీ వాసులను శాంతింపజేయడంతో వివాదం సద్దుమణిగింది.