సెంట్రల్ బడ్జెట్ అంటే కేంద్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చులకు సంబంధించిన లెక్కలని అర్థం. పక్కాగా రాయాల్సిన ఆ పద్దులో పెద్ద భారీ తేడా ఉన్నట్టు బయటపడింది. ఒకటి కాదు. రెండు కాదు. ఏకంగా రూ.లక్షా 70 వేల కోట్ల మేర లెక్కల్లో తేడా కనిపిస్తోందని కొందరు ఆర్థికవేత్తలు అంటున్నారు. ఇప్పుడు దీనిపైనే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొన్న లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో 2018–19కు సంబంధించి సవరించిన అంచనాల ప్రకారం సర్కారు రాబడి రూ.17.3 లక్షల కోట్లు ఉందని తెలిపారు. అంతకంటే ఒక్కరోజు ముందు లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వేలో 2018–19లో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.15.6 లక్షల కోట్లేనని పేర్కొన్నారు. ఈ రెండు లెక్కల మధ్య తేడా 1.7 లక్షల కోట్ల రూపాయలు. సవరించిన అంచనాల మాదిరిగానే ఎకనామిక్ సర్వే కూడా ఉజ్జాయింపు లెక్కలమీదనే ఆధారపడ్తది. అయితే అన్ని డిపార్ట్‌మెంట్ల నుంచి లెక్కలు తీసుకొని రిపోర్ట్ తయారు చేస్తది. ఈ లెక్కలు కొంచెం పక్కాగా ఉంటయన్న అభిప్రాయం ఉంది. ఈ లెక్కలు కరెక్టనుకుంటే బడ్జెట్‌లో రూ.1.7 లక్షల కోట్ల మేర రాబడి ఎక్కువ చూపించారన్నమాట. ఈ లెక్క తప్పుబోతే గవర్నమెంట్ ఖర్చుల లెక్కల్లో కూడా తేడాలు ఉన్నట్టే. 2018–19 బడ్జెట్‌లో ప్రభుత్వ వ్యయాన్ని రూ.24.6 లక్షల కోట్లుగా చూపించారు. కానీ సర్కారు రూ.23.1 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినట్లు ఆర్థిక సర్వేలో చెప్పారు.
ట్యాక్స్ రెవెన్యూ తగ్గటమే కారణమా?
ట్యాక్స్ రెవెన్యూ పడిపోవటం వల్లే ఈ లోటు ఏర్పడినట్లు ఎకనామిస్టులు భావిస్తున్నారు. గతేడాది వివిధ పన్నుల ద్వారా రూ.14.8 లక్షల కోట్లు వస్తాయని గవర్నమెంట్ అంచనా వేసింది. కానీ, రూ.13.2 లక్షల కోట్లే వచ్చాయి. బడ్జెట్‌కి, ఆర్థిక సర్వేకి మధ్య ఈ స్థాయిలో తేడా ఎందుకు వచ్చిందో చెప్పాలంటూ ఫైనాన్స్ మినిస్ట్రీని కోరినా ఇంతవరకూ సమాధానం లేదు.
ఎవరు గుర్తించారు?
ఈ విషయాన్ని స్వయంగా ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడు రతిన్ రాయ్ గుర్తించారు. ఒక ఇంగ్లిష్ డైలీకి ఇచ్చిన కాలమ్‌లో దీని గురించి రాశారు. ఆర్థిక సర్వేని, బడ్జెట్‌ని క్షుణ్ణంగా చదివిన ఆయన ఈ రెండింటి మధ్య తేడా ఉండటాన్ని
గమనించారు.