ఖమ్మం పత్తి మార్కెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 2 వేల 200 పత్తి బస్తాలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలియగానే నేలకొండపల్లి నుంచి సంఘటనా స్థలానికి చేరుకున్న మూడు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించాయి. ఫైర్ ఇంజన్లు ఆలస్యంగా రావడంతో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. పత్తి బస్తాలు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. మంటలను ఆర్పివేసేందుకు ఫైర్ సిబ్బంది చాలా శ్రమించాల్సి వచ్చింది.
రైతుల వద్ద కొన్న పత్తిని ఖమ్మం మార్కెట్ లోనే నిల్వ ఉంచారు వ్యాపారులు. ఈ పత్తి బస్తాలను గుజరాత్ కు ఎగుమతి చేసేందుకు ట్రేడర్ సర్వం సిద్ధం చేశారు. ఇంతలోనే ఈ ప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా..? లేక బీమా కోసం ప్రమాదాన్ని సృష్టించారా..? అనే కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోంది. సుమారు రూ.కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందంటున్నారు ట్రేడర్.
ఖమ్మం మార్కెట్‌లో ఉండాల్సిన ఫైర్ ఇంజిన్.. అధికారుల ఆదేశాల మేరకు నేలకొండపల్లి వెళ్లింది. అక్కడి నుంచి ఖమ్మం రావడానికి ఆలస్యమవడంతో ప్రమాదం కారణంగా ఎక్కువ ఆస్తి నష్టం వాటిల్లింది. మొత్తం కాలిపోయిన తర్వాత 3 ఫైరింజన్లు వచ్చాయి. అప్పటికే జరగాల్సిన ఆస్తి నష్టం జరిగిపోయింది.
ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 10 మంది ప్రత్యక్ష సాక్ష్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సమయానికి ఫైర్ ఇంజన్ లేకపోవటంతో ప్రమాదస్థాయి ఎక్కువగా జరిగిందంటున్నారు ట్రేడర్స్. మరోవైపు.. మార్కెట్ లో భద్రత లేదంటున్నారు. గతంలో జరిగిన ప్రమాదాలకు అసలు కారణాలేంటో ఇప్పటి వరకూ తెలియదు. మార్కెట్ పరిసర ప్రాంతాల్లో గంజాయి సేవించే ముఠా తిరుగుతూ.. ఇలాంటి ఘటనలకు పాల్పడుతుందనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. మరోవైపు.. మార్కెట్ పాలక వర్గం నిర్లక్ష్యం అడుగడుగునా కనపడుతోందన్న విమర్శలు ఉన్నాయి.