- కాలిబూడిదైన 90 టెంట్లు, భక్తుల సామగ్రి
మహాకుంభనగర్ (యూపీ): ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 90 వరకు టెంట్లు కాలిబూడిదయ్యాయి. ఆ ప్రాంతమంతా నల్లటి పొగ వ్యాపించింది. భక్తులు, సాధువులు భయంతో పరుగులు తీశారు. 2 సిలిండర్లు పేలడంతో మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన ఏరియా చుట్టుపక్కల టెంట్లలో ఉన్నవారిని సురక్షిత ప్రదేశాలకు తరలించామని తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఫైర్ ట్రక్కులను ఏర్పాటు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని వివరించారు. ఘటన జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలు అదుపు చేశారు. వేరే టెంట్లకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇలాంటి ప్రమాదం మళ్లీ జరగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా, ప్రయాగ్‌రాజ్‌లోని పరమార్థ ఆశ్రమ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులతో సమావేశమయ్యారు. కుంభ మేళా ఏర్పాట్లపై చర్చించి.. పలు సూచనలు చేశారు.
విచారం వ్యక్తం చేసిన నిర్వాహకులు
సెక్టార్ 19లో భక్తులు, సాధువుల కోసం ఏర్పాటు చేసిన టెంట్లో ఆదివారం మధ్యాహ్నం 2 గ్యాస్ సిలిండర్లు పేలాయి. దీంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మిగతా టెంట్లకు మంటలు అంటుకున్నాయి. దీంతో భక్తులు, సాధువులంతా భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గీతాప్రెస్‌కు చెందిన టెంట్లు కూడా మంటల్లో కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంపై మహా కుంభమేళా నిర్వాహకులు విచారం వ్యక్తం చేశారు. కాగా, అగ్ని ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు.
త్రివేణి సంగమంలో రాజస్థాన్ సీఎం పుణ్య స్నానం
మహా కుంభమేళా ప్రారంభమై ఆదివారంతో ఏడు రోజులు పూర్తయ్యాయి. ఇప్పటి దాకా సుమారు 8 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. మహాకుంభనగర్‌లో కోటి మంది భక్తులు ఉంటున్నారు. ఆదివారం సుమారు 50 లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్లు వివరించారు. రాజస్తాన్ సీఎం భజన్‌లాల్ శర్మ త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు.
మేళాలో బ్లింకిట్ స్టోర్
మహాకుంభ మేళాలో క్విక్ కామర్స్ సర్వీస్ బ్లింకిట్ తన టెంపరరీ స్టోర్‌ను ఓపెన్ చేసింది. భక్తులు, టూరిస్టులకు కావాల్సిన నిత్యవసరాలు అందించేందుకు తమ సర్వీసు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు బ్లింకిట్ సీఈవో అల్బిందర్ ధిండ్సా తెలిపా రు. పాలు, పెరుగు, పండ్లు, కూరగాయలు వంటి పూజా వస్తువులతో పాటు చార్జర్లు, పవర్ బ్యాంకులు, టవెల్స్, బ్లాంకెట్లు, బెడ్షీట్లు వంటివి అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. బుక్ చేసిన నిమిషాల్లోనే మహా కుంభనగర్‌లో ఎక్కడున్నా తమ సిబ్బంది డెలివరీ చేస్తారని కంపెనీ సీఈవో చెప్పారు.