దోమలో భారీ అగ్ని ప్రమాదం.. ఐదెకరాల గడ్డివాము దగ్ధం

వికారాబాద్ జిల్లా దోమ మండలం శివారులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దోమ గ్రామానికి చెందిన నిరంజన్ రెడ్డి అనే రైతు పొలంలోని గడ్డి వాములు మంటల్లో కాలిబూడిదయ్యాయి. దాదాపు ఐదు ఎకరాల వరి గడ్డి పూర్తిగా బూడిదైంది. అగ్ని ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే.. ఫైర్ సిబ్బంది వచ్చే లోపే గడ్డి పూర్తిగా మంటల్లో కాలిబూడిదయ్యింది. 

దోమ గ్రామానికి చెందిన కృష్ణ అనే వ్యక్తి తన గడ్డి వాములు తగులబెట్టాడని బాధితుడు నిరంజన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత కొన్ని రోజులుగా తమ మధ్య భూ వివాదం కొనసాగుతోందని, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కృష్ణ .. తమ గడ్డి వాములను తగులబెట్టాడని నిరంజన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.