
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని నందుపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నందుపల్లిలో ఓ సినిమా చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తూ సెట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తీవ్ర భయాందోళనకు గురైన మూవీ యూనిట్ సభ్యులు పరుగులు పెట్టారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపన సిబ్బంది మంటలను అదుపు చేశారు.
అగ్ని ప్రమాదం వల్ల దాదాపు ఒక కోటి 20 లక్షల నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీశారు. అయితే.. ఇక్కడ జరిగేది ఏ సినిమా షూటింగ్ అన్న విషయం మాత్రం తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు, మూవీ యూనిట్ ఊపిరి పీల్చుకుంది.