హైదరాబాద్ ఓల్డ్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహూతైన స్క్రాప్ గోడౌన్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహూతైన స్క్రాప్ గోడౌన్

హైదరాబాద్: ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాదన్న పేట చౌరస్తా ఈద్గా ఎదురుగా ఉన్న ఓ కట్టెల దుకాణం&స్క్రాప్ గోడన్‎లో గురువారం (డిసెంబర్ 19) తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి  సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేసినప్పటికీ పెద్ద ఎత్తున మంటలు చెలరేగి కట్టెల దుకాణం&స్క్రాప్ దుకాణ గోడన్ రెండు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. 

అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి దాదాపు 2 గంటల పాటు ఆరు ఫైర్ ఇంజన్ల సహయంతో మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ.. పెద్ద మొత్తంలో కట్టే దగ్దం కావడంతో భారీ ఆస్తి నష్టం వాటిల్లిందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. సూపర్ ఫైన్ వెల్డింగ్స్ పేరుతో ఈ గోడన్ ఉండేదని స్థానిక కార్పొరేటర్ షఫత్ అలీ చెబుతున్నారు.