- మేడిగడ్డలోని ఏడో బ్లాక్‌లో పెద్ద రంధ్రం గుర్తించిన అధికారులు
- దాని వల్లే రెండు గేట్లను ఎత్తలేని పరిస్థితి
- పూడ్చకపోతే పక్క బ్లాక్‌లపైనా ప్రభావం పడే చాన్స్
- ఏదేమైనా ఎన్డీఎస్ఏ కమిటీ సిఫార్సుల మేరకే ముందుకెళ్లాలని నిర్ణయం
- మూడు బ్యారేజీలను పరిశీలించిన సీడబ్ల్యూపీఆర్ఎస్ ఎక్స్ పర్ట్స్
- స్పెషల్ టెక్నికల్ కమిటీ ఏర్పాటుపై అధికారుల కసరత్తు
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్‌లోని కుంగిన పిల్లర్ల కింద భారీ రంధ్రం (వాయిడ్) ఉన్నట్టు అధికారులు గుర్తించారు. నేషనల్డ్యామ్సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద రిపేర్లు మొదలుపెట్టిన అధికారులు.. ఆయా బ్యారేజీల గేట్లను పైకి ఎత్తుతున్నారు. మేడిగడ్డలోని ఏడో బ్లాక్‌లో ఉన్న 8 గేట్లలో ఇప్పటికే ఐదు గేట్లను పైకి ఎత్తారు. మరో మూడు గేట్లను ఎత్తాల్సి ఉంది. కుంగిన పిల్లర్ల పక్కన ఉన్న 20, 21 నెంబర్గేట్లను ఎత్తడానికి బదులు పూర్తిగా తొలగించాలని ఎన్డీఎస్ఏ కమిటీ సూచించింది.
అయితే, ఆ బ్లాక్‌లో కుంగిన పిల్లర్ల కింద భారీ రంధ్రం ఉండడం వల్లే ఆ గేట్లను ఎత్తలేని పరిస్థితి ఉందని అధికారులు చెప్తున్నారు. ఒకవేళ ఆ రంధ్రాన్ని పూడ్చకుండా గేట్లను ఎత్తేందుకు ప్రయత్నిస్తే, దాని భారం పిల్లర్ల కింది భాగంలో పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ క్రమంలోనే గేట్లను పూర్తిగా తొలగించే బదులు, ఆ రంధ్రాన్ని కాంక్రీట్లేదా ఇతర మిశ్రమాలతో పూడ్చి గేట్లను పైకెత్తే ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.
రంధ్రం కూడా స్ట్రెయిట్‌గా లేదని, వంకరటింకరగా ఉందని చెబుతున్నారు. అది ఎంత పెద్దగా ఉందో చెప్పలేమని, అందుకోసం వివిధ టెస్టులు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఆ రంధ్రాన్ని పూడ్చడమే అతిపెద్ద టాస్క్అని చెబుతున్న అధికారులు.. దాన్ని అలాగే వదిలేస్తే ఏడో బ్లాక్ పక్కన ఉండే బ్లాక్‌లపైనా ప్రభావం పడే అవకాశం ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ చేసిన సిఫార్సుల మేరకే తాము ముందుకెళ్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
నేడు అధికారులతో నిపుణుల భేటీ..
ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ఇప్పటికే సీడబ్ల్యూపీఆర్ఎస్(సెంట్రల్వాటర్ అండ్పవర్ రీసెర్చ్‌స్టేషన్), నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఎన్జీఆర్ఐ), సెంట్రల్సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్) నిపుణులకు రాష్ట్ర సర్కార్ లేఖ రాసింది. ఈ నేపథ్యం లో బుధవారం సీడబ్ల్యూపీఆర్ఎస్కు చెందిన ముగ్గురు నిపుణులు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించారు.
జియోటెక్నికల్ఇన్వెస్టి గేషన్స్కోసం సైంటిస్ట్ డాక్టర్ జె.ఎస్.ఎడ్లబడ్కర్, జియోఫిజికల్ఇన్వెస్టిగేషన్స్కోసం సైంటిస్ట్ ధనుంజయ నాయుడు, నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ ఇన్వెస్టిగేషన్స్ కోసం ప్రకాశ్పాలిని సీడబ్ల్యూపీఆర్ఎస్ పంపించింది. బ్యారేజీల వద్ద పరిస్థితులను అధ్యయనం చేసిన నిపుణులు.. గురువారం జలసౌధలో ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఈఎన్సీలు అనిల్‌కుమార్, నాగేందర్రావు తదితర అధికారులతో సమావేశం కానున్నారు. బ్యారేజీల పరిస్థితిపై చర్చించనున్నారు.
టెక్నికల్ కమిటీలో ఐఐటీ, ఎన్ఐటీ ఎక్స్పర్ట్స్
కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ఆదేశాల మేరకు స్పెషల్ టెక్ని కల్ కమిటీ ఏర్పాటుపై ఆఫీసర్ల కసరత్తు చేస్తున్నారు. జ్యుడీషియల్ కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఇప్పటికే రెండుసార్లు హైదరాబాద్‌కు వచ్చారు. మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్రావుతో పాటు అధికారులతో భేటీ అయ్యారు. బ్యారేజీలపై మరింత సమాచారం కోసం ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో సంబంధం లేని సాంకేతిక నిపు ణులతో ఓ స్పెషల్టెక్నికల్ కమిటీని ఏర్పాటు చే యాలని జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు.
కమిటీ ఏర్పాటుపై అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. నలుగురు లేదా ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఐఐటీ, ఎన్ఐటీ లేదా ఇతర ప్రభుత్వ ఉన్నత సంస్థల్లోని టెక్నికల్ఎక్స్పర్ట్స్ జాబితాను సిద్ధం చేసి సర్కార్ కు ప్రతిపాదించనున్నారు. జూన్ మొదటి వారంలో జస్టిస్పీసీ ఘోష్ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఈ క్రమంలోనే స్పెషల్ టెక్నికల్ కమిటీని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
షీట్ పైల్స్ వస్తున్నయ్..
బ్యారేజీల రిపేర్ల పనులను వేగంగా చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే దెబ్బతిన్న షీట్‌పైల్స్ స్థానంలో కొత్త షీట్‌పైల్స్‌ను మారుస్తున్నట్టు చెప్పారు. గురువారం నాటికి షీట్పైల్స్బ్యారేజీల వద్దకు చేరుకుంటాయని తెలిపారు. మరోవైపు జియోటెక్నికల్ఇన్వెస్టిగేషన్స్లో భాగంగా ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ బోర్ డ్రిల్లింగ్‌చేసి టెస్టులు చేయాలని చెప్పింది.
దీంతో ఇప్పటికే బోర్డ్రిల్లింగ్మెషిన్లను కూడా అధికారులు తెప్పించినట్టు తెలిసింది. జియోఫిజికల్ఇన్వెస్టిగేషన్లో భాగంగా బ్యారేజీల్లోని ఎగువ, దిగువ పిల్లర్ల వద్ద సాయిల్ శాంపిళ్లను తీసుకుని పటిష్ఠతను పరిశీలించనున్నారు. జియోటెక్నికల్ఇన్వెస్టిగేషన్లో భాగంగా డ్రిల్లింగ్‌చేసి పిల్లర్ల కిందకు సెన్సర్లను పంపించి అక్కడి పరిస్థితులను అంచనా వేస్తారు. ఎన్డీటీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా పెద్ద వరద వచ్చినా పిల్లర్లు, షీట్‌పైల్స్, సీకెంట్పైల్స్వంటివి ఎంత మేరకు తట్టుకుంటాయన్న దానిపై విశ్లేషణ చేస్తారు.