చెరువులు పూడ్చి..వేల కోట్ల దోపిడీ!

చెరువులు పూడ్చి..వేల కోట్ల దోపిడీ!
  • బీఆర్ఎస్​ హయాంలో హైదరాబాద్​ కేంద్రంగా భారీ భూస్కామ్​
  • పదేండ్లలో ఓఆర్​ఆర్​ లోపలి 171 చెరువులు కబ్జా
  • 386.72 ఎకరాల చెరువు భూముల్లో లే ఔట్లు వేసి రూ. 19 వేల కోట్లు స్వాహా
  • నాడు చెరువులు, చెట్లతో నిండిన ప్రాంతాల్లో ఇప్పుడు పెద్దపెద్ద బిల్డింగ్స్​​
  • పదేండ్ల కిందటి, ప్రస్తుత శాటిలైట్​ ఫొటోలలో స్పష్టంగా తేడాలు
  • టీజీఆర్​ఏసీ  నివేదికతో భారీ భూ దందా బట్టబయలు
  • కబ్జాల వెనుక పలువురు బీఆర్​ఎస్​ నేతలు, ఆఫీసర్ల పాత్ర ఉన్నట్లు అనుమానాలు

హైదరాబాద్​, వెలుగు : గత బీఆర్​ఎస్  హయాంలో హైదరాబాద్​ కేంద్రంగా జరిగిన భారీ ల్యాండ్​ స్కామ్​ బయటపడింది. ఔటర్​ రింగ్​ రోడ్డు(ఓఆర్​ఆర్)​ లోపల ఉన్న 171 చెరువులను పదేండ్లలో కబ్జా చేసి.. 386.72 ఎకరాల్లో లే ఔట్లు వేసి అమ్మేసుకోవడం ద్వారా  దాదాపు రూ.19 వేల కోట్ల దోపిడీకి పాల్పడినట్లు తేలింది. ఈ కుంభకోణం వెనుక పలువురు బీఆర్ఎస్​ నేతలు, కొందరు ఉన్నతాధికారులు కీలకంగా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2014 వరకు ఎలాంటి ఆక్రమణలు లేని 44 చెరువులు పదేండ్ల కాలంలో పూర్తిగా మాయమయ్యాయి. 

ఆయా చెరువులను మట్టితో పూడ్చి 104.29 ఎకరాల్లో లే ఔట్లు చేసి అమ్మేశారు. వాటిలో చాలావరకు పెద్ద, పెద్ద బిల్డింగులు లేపారు. తెలంగాణ వచ్చేనాటికి ఎలాంటి కబ్జాలు లేని 57 చెరు వులు.. గడిచిన పదేండ్లలో 50 శాతం అన్యాక్రాంతమయ్యాయి.  వీటిలో 126.12 ఎకరాలను ప్లాట్లు చేసి అమ్మేశారు. 2014 కు ముందు 10 నుంచి 20శాతం అన్యాక్రాంతమైన 70 చెరువుల్లోనూ పదేండ్లలో  70 శాతం మేర కబ్జాలపాలయ్యాయి. ఇందులో 156.31 ఎకరాలు స్వాహా అయ్యాయి.  

హైదరాబాద్​, ఓఆర్​ఆర్​ లోపలి చెరువుల పరిస్థితిపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రిమోట్​ సెన్సింగ్​ అప్లికేషన్స్​ సెంటర్​ (టీజీఆర్​ఏసీ) నివేదిక ఇచ్చింది. పదేండ్ల కిందటి, ప్రస్తు త శాటిలైట్​మ్యాపులను అందజేసింది. ఈ మ్యాపుల్లో నాటికి, నేటికి తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  అప్పట్లో చెరువులు, చెట్లతో నిండిన ప్రాంతాలన్నీ ఇప్పుడు రెసిడెన్షియల్, కమర్షియల్​ బిల్డింగ్స్​తో కాలనీలను తలపిస్తున్నాయి.

అనుమతుల వెనుక ఉన్నదెవరు?

రాష్ట్ర ప్రభుత్వానికి టీజీఆర్​ఏసీ అందజేసిన శాటిలైట్​ మ్యాపులను ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టాక అనుమతులు తీసుకున్నారా?  లేదంటే చెరువులను పూడ్చి పర్మిషన్లు తీసుకున్నాకే నిర్మాణాలు చేపట్టారా? అనేదానిపై ప్రభుత్వం విచారణ చేయిస్తున్నది. జీహెచ్​ఎంసీ, ఓఆర్​ఆర్​ పరిధిలో అన్ని కూడా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలే ఉన్నాయి. చెరువులు కబ్జాకు గురైన టైంలో ఎవరెవరు ఉన్నతాధికారులుగా ఉన్నారు ? నాడు మున్సిపల్​ మంత్రిగా ఉన్న కేటీఆర్​ దృష్టికి ఇవి వెళ్లలేదా? అనే కోణంలోనూ ఎంక్వైరీ జరుగుతున్నది. 

అప్పట్లో నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్ల నుంచి వివరణ తీసుకున్నాక, బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశముంది. శాటిలైట్​మ్యాపుల ఆధారంగా సర్వే చేసి ఎలాంటి నిర్మాణాలు లేని స్థలాలను వెంటనే వెనక్కి తీసుకొని, ఆయా చోట్ల చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తున్నదని తెలిపారు.  నిర్మాణాలు ఉన్నచోట్ల అవి ఎవరి పేరుతో ఉన్నాయి? బినామీలు ఉన్నారా? నేరుగా లే ఔట్లు, ఓపెన్​ ప్లాట్లు చేసి సేల్​ చేశారా? అనే వివరాలు కూడా బయటకు వస్తాయని ఓ అధికారి వివరించారు. 

రాష్ట్ర ప్రభుత్వానికి టీజీఆర్​ఏసీ​ ఇచ్చిన నివేదికలోని కొన్ని అంశాలు.. ​ 

  • రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014లో హైదరాబాద్ పరిధిలో చెరువులు, కుంటలు కలిపి 920 నీటి వనరులు ఉన్నాయి. అంతకు 20-30 ఏండ్ల కింద 225 చెరువులు పూర్తిగా..  196 చెరువులు పాక్షికంగా అన్యాక్రాంతమయ్యా యి. తెలంగాణ వచ్చేనాటికి 499 చెరువులు ఎలాంటి కబ్జాలు లేకుండా ఉన్నాయి. 
  • తెలంగాణ వచ్చే నాటికి ఎలాంటి కబ్జాలు లేకుండా ఉన్న 499 చెరువుల్లో గడిచిన పదేండ్లలో 44 చెరువులు పూర్తిగా.. 127 చెరువులు 50 నుంచి 70 శాతం మేర కబ్జాల పాలయ్యాయి. మొత్తంగా ఆయా చెరువులను పూడ్చి, 386.71 ఎకరాలనులే ఔట్లు చేసి అమ్మేశారు. 
  • చెరువుల్లో కబ్జాల వల్ల  ఓ మోస్తరు వర్షానికే ఆయా ప్రాంతాలన్నీ నీటితో మునిగి పోతున్నా యి. పర్యావరణ అసమతుల్యత కారణంగా ఆయా చోట్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వాతావరణ పరిస్థితుల్లో ఆకస్మిక మార్పుల వల్ల సమయం, సందర్భం లేకుండా వానలు పడ్తున్నాయి. అప్పుడే వేడి పుట్టడం, అప్పుడే వర్షంపడడం జరుగుతున్నది.  అదీగాక చెరువులతో ముడిపడి ఉన్న జీవజాలం అంతరిస్తున్నది. కొన్నిరకాల జంతువులు, పక్షుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.  

అన్నీ ప్రైమ్​ ఏరియాలోనివే!

పదేండ్లలో కబ్జాలపాలైన చెరువులు ఉన్న ప్రాంతాలన్నీ ప్రైమ్​ఏరియాలోనివే. ఆయా చోట్ల ఏరియాను బట్టి ఎకరా రూ.వంద కోట్ల దాకా పలుకుతున్నది. అప్పటి సర్కారు రియల్​బూమ్​పేరిట అరచేతిలో వైకుంఠం చూపితే.. ఇదే అదనుగా కొందరు బీఆర్​ఎస్​ లీడర్లు చెరువులను పూడ్చి రియల్​ ఎస్టేట్ ద్వారా  వేల కోట్ల దందాకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని కీలక ఏరియాల్లో నాటి ప్రభుత్వ పెద్దలు నేరుగా ఇన్​వాల్వ్​ కాగా,  మరికొన్నిచోట్ల కింది స్థాయి లీడర్లతో పనికానిచ్చినట్లు​ ప్రస్తుత ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది. 

ఎకరా రూ.30 కోట్ల నుంచి 100 కోట్ల దాకా పలుకుతున్న ఏరియాల్లోనే చెరువులు ఎక్కువగా మాయం కావడం అంతా ఒక ప్లాన్​ ప్రకారం జరిగినట్లు అనుమానిస్తున్నది. పుప్పాలగూడలో గత ప్రభుత్వం భూములు వేలం వేస్తే ఎకరా వంద కోట్లు పలికింది. అమీన్​పూర్, షేక్​పేట ఏరియాలోనూ 60 కోట్లకు తగ్గలేదు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్, గండిపేట, బాలాపూర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్​ మండలాల్లో,  మేడ్చల్ జిల్లా అల్వాల్, కూకట్​పల్లి, మేడిపల్లి, కీసర, ఉప్పల్​ మండలాల్లో, హైదరాబాద్​ జిల్లా మారేడ్​పల్లి, షేక్​పేట మండలాల్లో, సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మండలంలో 2014 తర్వాత 44 చెరువులు పూర్తిగా మాయమయ్యాయి.

  • 2014 తర్వాత హైదరాబాద్​లో చెరువుల పరిస్థితి ఇదీ..

  • పదేండ్లలో పూర్తిగా మాయమైన చెరువులు 44
  • ఆక్రమించిన భూమి  (ఎకరాల్లో): 104.29
  • 2014కు ముందు ఎలాంటి కబ్జాలు లేని, ఆ తర్వాత పదేండ్లలో 50శాతం కబ్జా అయిన చెరువులు:  57
  • ఆక్రమించిన భూమి (ఎకరాల్లో): 126.12
  • 2014కు ముందు 10-20 శాతం కబ్జా ఉండి, ఆ తర్వాత పదేండ్లలో 70 శాతం కబ్జాలోకి వెళ్లిన చెరువులు: 70
  • ఆక్రమించిన భూమి (ఎకరాల్లో): 156.31
  • కబ్జా అయిన మొత్తం భూమి (ఎకరాల్లో): 386.72