గుడిసెవాసులకు పట్టాలివ్వాలని హనుమకొండలో పేదల భారీ ర్యాలీ

గుడిసెవాసులకు పట్టాలివ్వాలని హనుమకొండలో పేదల భారీ ర్యాలీ
  • సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
  • కలెక్టర్​ ప్రావీణ్య హామీతో విరమణ 

హనుమకొండ, వెలుగు : ప్రభుత్వ స్థలాల్లో నిరుపేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలివ్వడంతో పాటు కరెంట్ మీటర్లు ఏర్పాటు చేయాలని గుడిసెవాసులు డిమాండ్​ చేశారు. కొన్నేండ్లుగా గుడిసెల్లో ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఇందిరమ్మ పథకం కింద ఇండ్లు కట్టించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గుడిసెవాసులకు పట్టాలివ్వాలని హనుమకొండలోని ఆర్ట్స్​ కాలేజీ ఆడిటోరియం నుంచి కలెక్టరేట్​వరకు సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్​ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు.

అనంతరం పోలీసుల అనుమతితో పలువురు సీపీఎం లీడర్లు కలెక్టర్ ​ప్రావీణ్యను కలిసి వినతిపత్రం ఇచ్చారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని కలెక్టర్​ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి మాట్లాడుతూ ఇండ్ల కిరాయిలు కట్టలేక ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని ఉంటున్న పేదలందరికీ జీవో 58 ప్రకారం పట్టాలిచ్చి, కరెంట్ మీటర్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. గుడిసె వాసులకు తాగునీరు, రోడ్లు, కరెంట్​, టాయిలెట్స్​ సౌకర్యం లేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.

దోమలు, పాములు, తేళ్లతో అవస్థలు పడుతున్నా పట్టించుకునేవారులేరన్నారు. గతంలో ఇండెంట్​ బాండ్​పేరుతో గుడిసె వాసులకు కరెంట్​మీటర్లు ఇచ్చారని, అలాగే 15 ఏండ్ల నుంచి నివాసముంటున్న భగత్​ సింగ్​నగర్, పెద్దమ్మగడ్డ, జ్యోతిబసునగర్, సుర్జీత్​నగర్, ఎంఎన్​నగర్, ఇంజినీర్స్​కాలనీ, జ్యోతిరావు పూలే నగర్​తదితర ఏరియాల్లోని పేదలకు పట్టాలిచ్చి, ఇందిరమ్మ పథకం కింద ఇండ్లు కట్టించాలని డిమాండ్​ చేశారు.

సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.ప్రభాకర్ రెడ్డి, ఎం.చుక్కయ్య, టి.ఉప్పలయ్య, లీడర్లు వాంకుడోతు వీరన్న, గొడుగు వెంకట్,  గాదె రమేశ్, ఆలకుంట యాకయ్య, పెండ్యాల రవి, మంద మల్లేశం, కారు ఉపేందర్, కుక్కమూడి రవీందర్ పాల్గొన్నారు.