స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని ప్రజలకు తెలియజేయాలి

ఖమ్మం: రెండు కిలోమీటర్ల పొడవైన జాతీయ జెండాతో నగరంలో భారీ ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్... వేడుకలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఆగస్టు 15తో దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 8నుంచి 22 వరకు ‘స్వతంత్ర భారత వజ్రోత్సవాలు’ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నిర్వహించిన ర్యాలీలో దాదాపు 10 వేల మంది వరకు ప్రజలు పాల్గొన్నారు.  జడ్పీ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం, ఐటీ హబ్ సెంటర్  మీదుగా సర్దార్ పటేల్ స్టేడియం వరకు సాగిన ఈ ర్యాలీలో ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ కేడెట్స్‌, ఉద్యోగులు, అధికారు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి అజయ్ కుమార్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 16న సామూహిక స్వాతంత్య్ర జాతీయ గీతాలోపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. భారత స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని ప్రజలకు తెలియచేయాలని కోరారు.