సగం ధరకే స్కూటర్లు, టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్స్: 40 వేల మంది డబ్బులు కట్టిన తర్వాత ఏమైందంటే..?

సగం ధరకే స్కూటర్లు, టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్స్: 40 వేల మంది డబ్బులు కట్టిన తర్వాత ఏమైందంటే..?

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. సగం ధరకే స్కూటర్లు, టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్స్ అంటూ ప్రజలను మభ్యపెట్టి కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు ఓ వ్యక్తి. మోసపోయామని గ్రహించి బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. మైండ్ బ్లోయింగ్ విషయాలు బయటపడ్డాయి. కోటీ కాదు రెండు కోట్లు కాదు ఏకంగా.. రూ.500 కోట్ల వరకు మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. 30 వేల నుంచి 40 వేల మంది బాధితులు ఉన్నట్లు తెలిసింది. 

ఈ ఘటనకు సంబంధి పోలీసుల వివరాల ప్రకారం.. ఇడుక్కి జిల్లాలోని కుడయత్తూర్‌కు చెందిన 28 ఏళ్ల అనంతు కృష్ణన్ సగం ధరకే స్కూటర్లు, టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్స్, ఇతర గృహోపకరణాలు అందిస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చాడు. మహిళలు కేవలం రూ.60,000కే రూ.1.2 లక్షల ధర గల స్కూటర్‌ను సొంతం చేసుకోవచ్చని నమ్మించాడు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే ప్రచారం చేశాడు. ప్రజల్లో నమ్మకం కోసం స్టార్టింగ్‎లో ఆఫర్ ప్రకటించినట్లుగానే కొందరికి సగం ధరలకే  స్కూటర్లు, టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్స్ అందించాడు. దీంతో అనంతుపై ప్రజల్లో నమ్మకం ఏర్పడింది.

 ఇంకేముంది సగం ధరకే వస్తువులు వస్తుండటంతో పొట్టగట్టుకుని మరీ భారీ సంఖ్యలో ప్రజలు అనంత కృష్ణకు డబ్బులు కట్టారు. కొందరు డబ్బులు లేకున్నా అప్పు చేసి మరీ మనోడి దగ్గర పెట్టుబడులు పెట్టారు. ఇలా కోట్ల  రూపాయలు జమ్ చేసిన అనంతు.. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయాడు. దీంతో ఆందోళనకు గురైన బాధితులు.. చివరకు మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతు కృష్ణన్ పెద్ద ఎత్తున స్కామ్ చేశాడని గుర్తించిన ప్రభుత్వం.. దర్యాప్తు చేపట్టేందుకు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేసింది.

 2025, జనవరి 30న పోలీసులు అనంతును అరెస్టు చేసి.. అతడి బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. ఈ స్కామ్‎లో 30 వేల నుంచి 40 వేల మంది చిక్కుకున్నట్లు  పోలీసులు గుర్తించారు. ఈ స్కామ్ విలువ రూ. 500 కోట్లుగా పోలీసులు అంచనా వేశారు. ఈ స్కామ్ లో అనంతుతో పాటు అతడికి మరికొందరు సహకరించినట్లు గుర్తించిన పోలీసులు.. వారిని కోసం దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ స్కామ్ కేరళ రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పి్స్తున్నాయి.