దశాబ్దాల గ్రహణం తర్వాత బయటపడ్డ భారీ నక్షత్రం

  • విస్టా టెలిస్కోప్ సాయంతో గుర్తించిన సైంటిస్టులు

మిల్కీ వే గెలాక్సీలో ఒక భారీ నక్షత్రాన్ని యూరోపియన్ స్పేస్‌‌‌‌ ఏజెన్సీ సైంటిస్టులు గుర్తించారు. కొన్ని దశాబ్దాలుగా గ్రహణం పట్టి.. కనిపించకుండా పోయిన ఈ నక్షత్రం మళ్లీ బయటపడింది. ప్రపంచంలోనే అతి పెద్ద టెలిస్కోప్‌‌‌‌లలో ఒకటైన విస్టా టెలిస్కోప్‌‌‌‌ సాయంతో సైంటిస్టులు దీనిని పసిగట్టారు. ఈ నక్షత్రం పేరు VVV-–WIT-08. ఇది ఇన్నాళ్లుగా కనిపించకుండా పోవడానికి కారణమైన గ్రహణం ఏదైనా గ్రహం ద్వారా ఏర్పడిందా? లేక మరేదైనా స్పేస్ ఆబ్జెక్ట్‌‌‌‌ వల్ల ఏర్పడిందా? అన్న దానిపై క్లారిటీ లేదని సైంటిస్టులు చెబుతున్నారు.

97 శాతం కాంతి మాయం
VVV–-WIT-08 నక్షత్రం ఆకాశంలో దాదాపు వందేండ్లుగా కనిపించకుండా పోయింది. ఇందుకు కారణం.. ఆ నక్షత్రం నుంచి వచ్చే కాంతిలో 97 శాతం కాంతి మాయం కావడమే. ఈ బ్రైట్‌‌‌‌నెస్‌‌‌‌ 2012 నుంచి క్రమంగా పెరుగుతూ ఇటీవలే పూర్తి స్థాయిలో విస్టా టెలిస్కోప్‌‌‌‌లో కనిపించింది. మరో నక్షత్రం లేదా గ్రహం, మరేదైనా స్పేస్ ఆబ్జక్ట్ దాని కక్షలో అడ్డుగా రావడం వల్ల గ్రహణం ఏర్పడి ఇన్నేండ్లు కనిపించకుండా పోయుంటుందని, క్రమంగా ఆ గ్రహణం తొలగిందని ఆస్ట్రోనమర్స్‌‌‌‌ అంచనా వేస్తున్నారు. కానీ ఏ నక్షత్రం కూడా కొన్ని నెలలకు మించి ఇలా కనిపించకుండా ఉండిపోదు. ఈ నక్షత్రం కంటే 100 రెట్లు చిన్నదైన సూర్యుడికే కొన్ని సంవత్సరాలకోసారి గ్రహణం ఏర్పడుతుంటుంది. అయితే VVV-–WIT-08 నక్షత్రం విషయంలో ఇలా జరగడానికి కారణంపై అధ్యయనం చేస్తున్నామని, ఏ ఆబ్జెట్‌‌‌‌ ఏండ్ల పాటు దాని కాంతిని అడ్డుకోగలిగిందన్న అంశంపై పరిశోధనలు కొనసాగిస్తామని యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌‌‌‌బర్గ్ సైంటిస్ట్‌‌‌‌ డాక్టర్ సెర్గే కొపొసోవ్ తెలిపారు. అలాగే బ్రైట్‌‌‌‌నెస్ తగ్గిస్తూ పెంచుతూ బ్లింక్ అవుతుండడం వల్ల ఇలా జరిగిందా అన్న విషయంపైనా పరిశీలిస్తున్నామన్నారు. అయితే నక్షత్రాలేవీ తమ కాంతిని అంతటి సుదీర్ఘకాలం ఆపి ఉంచడం జరగదని చెప్పారు.

సూర్యుడి కంటే 100 రెట్లు పెద్దది
విశ్వంలో కొన్ని వందల కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. ఒక్కో గెలాక్సీలో లక్షల కోట్ల సంఖ్యలో నక్షత్రాలు, గ్రహాలు ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటే మన సూర్యుడు ఉన్న గెలాక్సీ.. దీనిని మనం మిల్కీ వే అంటున్నాం. ఇందులో దాదాపు 20 వేల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. సూర్యుడి కంటే పెద్ద నక్షత్రాలు కూడా మిల్కీ వేలో చాలా ఉన్నాయి. అయితే అవేవీ పగటి పూట మనకు కనిపించకపోవడానికి కారణం అవి సూర్యుడి కంటే కూడా భూమి నుంచి చాలా దూరంలో ఉండటమే. తాజాగా సైంటిస్టులు గుర్తించిన VVV-–WIT-08 నక్షత్రం కూడా సూర్యుడి కంటే 100 రెట్లు పెద్దదని వారు చెబుతున్నారు. అయితే ఇది సూర్యుడి కంటే కొన్ని వేల లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. సైంటిస్టుల అంచనా ప్రకారం ఈ  నక్షత్రం మన మిల్కీ వే మధ్యలో ఉంది. భూమి నుంచి 25 వేల లైట్ ఇయర్స్ దూరంలో దీనిని గుర్తించినట్లు చెబుతున్నారు.

ప్రపంచంలోనే  అతి పెద్ద టెలిస్కోప్
ప్రపంచంలో ఉన్న అతి పెద్ద టెలిస్కోప్‌‌‌‌లలో ఒకటి విస్టా టెలిస్కోప్. విస్టా అంటే వేరియబుల్ అండ్ ఇన్‌‌‌‌ఫ్రారెడ్ సర్వే టెలిస్కోప్‌‌‌‌ ఫర్ ఆస్ట్రొనమీ అని అర్థం. ఇది చిలీ దేశంలో ఉంది. దీనిని బ్రిటన్ ఏర్పాటు చేసింది. విస్టా ఆపరేషన్‌‌‌‌ మొత్తం యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ చూస్తుంది. VVV-WIT-08 నక్షత్రంపై ఇప్పటి వరకూ ఎటువంటి క్లారిటీ లేకపోవడంతోనే దీనికి ఈ పేరు పెట్టారు. విస్టా టెలిస్కోప్‌‌‌‌ ద్వారా గుర్తించిన వేరియబుల్ నక్షత్రం కావడంతో మూడు ‘వీ’లు, ‘వాటీస్ దిస్’ అనే కేటగిరీలో వేసిన ఎనిమిదో నక్షత్రం కావడంతో WITని కలిపి VVV-WIT-08 అని శాస్త్రవేత్తలు పేరుపెట్టినట్లు ప్రొఫెసర్ ఫిలిప్ లూకస్ తెలిపారు.