ఈ మధ్యకాలంలో మనుషుల హత్యలు బాగా జరుగుతున్నాయి. ఇక్కడా.. అక్కడా అనే తేడా లేదు. నడిరోడ్లపై మనుషులను దారుణంగా హత్య చేస్తున్నారు. అందరూ చూస్తుండగానే పదునైన ఆయుధాలతో నరికి చంపేస్తున్నారు. క్షణికావేశంలో చేస్తున్న మర్డర్లు ఆందోళన కల్గిస్తున్నాయి. తాజాగా పంజాబ్ లో ఈలాంటి ఘటనే ఒకటి జరిగింది. రద్దీగా ఉండే మార్కెట్ లో ఓ వ్యక్తి తన భార్యను అందరూ చూస్తుండగానే నరికి చంపాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకునే ప్రయత్నించాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం..
పంజాబ్ రాష్ర్టానికి చెందిన ఓ దంపతుల మధ్య కొన్నాళ్ల నుంచి వివాదం నడుస్తోంది. భార్యభర్తల మధ్య విబేధాల కారణంగా విడాకుల కేసులో కోర్టులో ఉంది. ఈ క్రమంలోనే ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. సంగ్రూర్ లోని అత్యంత రద్దీగా ఉండే సున్నం మార్కెట్ లో తన భార్య కనిపించేసరికి ఆగ్రహంతో ఊగిపోయిన భర్త.. ఆమెపై పదునైన ఆయుధం (గొడ్డలి)తో దాడి చేశాడు. ఆమె గట్టిగా కేకలు వేస్తూ.. చంపొద్దని వేడుకున్నా.. అస్సలు వినిపించుకోలేదు. మరింత కోపంతో గొడ్డలితో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే రక్తపు మడుగులో ప్రాణం విడిచింది.
తన భార్యపై నిందితుడు గొడ్డలితో దాడి చేస్తున్న సమయంలో మార్కెట్ లో జనం పెద్ద సంఖ్యలో ఉన్నారు. కొందరు సినిమా చూస్తున్నట్లు చూశారు. మరికొందరు తమ సెల్ ఫోన్లలో ఈ ఘటనను రికార్డు చేస్తూ కనిపించారు. కొందరు మాత్రం నిందితుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ.. భయంతో ముందుకు వెళ్లలేదు. గొడ్డలితో తమను కూడా చంపేస్తాడనే భయంతో ఎవరూ ధైర్యం చేయలేదు. కొందరు అడ్డుకునేందుకు ముందుకు వస్తుంటే వారికి గొడ్డలి చూపిస్తూ భయపెట్టాడు నిందితుడు.
మార్కెట్‌లో ఉన్న ప్రత్యక్ష సాక్షులు కొందరు నిందితుడిపై ఇటుకలతో దాడి చేశారు. మరికొందరు కర్రలు చేతిలో పట్టుకుని కనిపించారు. ఓ వ్యక్తి అయితే.. నీళ్లతో నిండి ఉన్న బకెట్ ను నిందితుడిపై విసిరేశాడు. దీంతో వారిపై కోపంతో రగిలిపోతూ గట్టిగా అరిచాడు. అక్కడ ఉన్న వారంతా తనను ఎలాగైనా చంపేస్తారనుకున్నాడో ఏమోగానీ.. వెంట తెచ్చుకున్న విషాన్ని తాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే స్థానికులు అడ్డుకుని.. దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు. నిందితుడిని డిశ్చార్జ్ చేయగానే పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.