తాగుడుకు బానిసై భార్యను చంపిండు

ఖమ్మం కార్పొరేషన్​, వెలుగు :  భార్యను రోకలిబండతో కొట్టి ఓ భర్త హత్య చేశాడు.   ఖమ్మంలో ఆదివారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..   జిల్లాలోని వైరా మండలం పినపాక గ్రామానికి చెందిన దేవమణి (37)కి,  రాంబాబుకు 20ఏండ్ల కింద పెండ్లి అయ్యింది. వారికి ఇద్దరు సంతానం.  దేవమణి ఖమ్మం ఆర్టీసీ డిపోలో కండక్టర్​గా,  భర్త రాంబాబు ఆటోడ్రైవర్​గా పనిచేస్తున్నాడు.  తాగుడుకు బానిసైన రాంబాబుకు, దేవమణికి మధ్య రోజూ గొడవలు జరిగేవి.  దీంతో పెద్దల సమక్షంలో పంచాయితీ చేశారు. అయినా రాంబాబులో మార్పురాకపోవడంతో ఆరేండ్లుగా దేవమణి పిల్లలతో కలిసి విడిగా అద్దె ఇంట్లో ఉంటోంది.  అలాగే విడాకులకు దరఖాస్తు చేసింది.

 ఈ నెల 6న కోర్టు తీర్పు రానుంది.  కాగా, ఆదివారం అర్ధరాత్రి దేవమణి కాలకృత్యాలు తీర్చుకునేందుకు లేచిన సమయంలో అక్కడే కాపు కాస్తున్న రాంబాబు ఆమె తలపై రోకలిబండతో కొట్టి హతమార్చాడు. కూతురు అశ్విత అడ్డు రావడంతో ఆమెను  నెట్టివేశాడు. అనంతరం ఆమె లేచి కుటుంబ సభ్యులకు ఫోన్​లో సమాచారం అందించింది.   కొడుకు ప్రణవ్​ తేజ టెన్త్​ ఎగ్జామ్స్​కు హాస్టల్​లో ఉంటూ ప్రిపేర్​ అవుతున్నాడు.  టూటౌన్​ సీఐ శ్రీధర్​గౌడ్​ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రాంబాబు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.