కుటుంబ కలహాలతో.. భార్యను చంపి.. ఉరేసుకున్న భర్త

కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్ లోని మార్కండేయ నగర్ కాలనీలో కుటుంబంలో గొడవలతో ఓ భర్త తన భార్యను హత్య చేసి తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేముల ప్రవీణ్(50)కు లావణ్య(42)కు 18 ఏండ్ల కింద పెండ్లయ్యింది. వీరికి కల్యాణి అనే కూతురు ఉంది. ప్రవీణ్  ప్రవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ ​టెక్నీషియన్ కాగా,  లావణ్య టైలరింగ్ చేస్తోంది. కూతురు నగునూర్ లో టెన్త్​చదువుతూ అక్కడే హాస్టల్​లో ఉంటోంది. ఇంట్లో దంపతులిద్దరే ఉండేవారు. 

అదే ఇంట్లో పైఅంతస్తులో ప్రవీణ్ తల్లిదండ్రులు విజయ, వీరమల్లు ఉంటున్నారు. ప్రవీణ్, లావణ్యల మధ్య పెండ్లయినప్పటి నుంచి గొడవల జరుగుతున్నాయి. పెద్దలు సర్ది చెప్పినా మార్పు రాలేదు. శనివారం కూడా వీరి మధ్య గొడవ జరిగింది. దీంతో  ప్రవీణ్.. లావణ్య మెడకు కొంగు చుట్టి సిమెంట్ఇటుకతో తలపై కొట్టి చంపేశాడు. శవాన్ని ఇంట్లోనే ఉంచి.. ఆదివారం హాస్టల్​కు వెళ్లి కూతురును చూసి వచ్చాడు. తర్వాత లావణ్య, ప్రవీణ్ ఫోన్​ లిఫ్ట్​ చేయకపోవడంతో బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటికి వెళ్లి చూడగా ప్రవీణ్​ ఫ్యాన్​కు ఉరివేసుకొని కనిపించాడు. పక్కనే లావణ్య డెడ్​బాడీ కనిపించింది. తమ చావులకు ఎవరు కారణం కాదని రాసిన సూసైడ్ ​నోట్ పోలీసులకు దొరికింది.